ప్రజా విజ్ఞప్తులపై అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
సాక్షి, చైన్నె: ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులన్నీ సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆదేశించారు. మంగళవారం ఆయన విరుదునగర్ జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల తీరుతెన్నులను పరిశీలించారు. మహిళల కోసం అమలవుతున్న వివిధ పథకాలపై ఆరా తీశారు. మహిళా హక్కు పథకం కోసం దరఖాస్తులు చేసుకునే వారి వివరాలను పరిశీలించారు. కలైంజ్ఞర్ గృహాల కోసం విన్నవించుకున్న వారి వివరాలను తెలుసుకున్నారు. అల్పాహార పథకంతోపాటుగా వివిధ పథకాలను సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేవించారు. ప్రజల్లోకి వివిధ పథకాలు చొచ్చుకు వెళ్లాలని, లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలని సూచించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, క్రీడా పరికరాలు, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలను అందజేశారు. తమిళనాడును భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్.రామచంద్రన్, తంగం తెన్నరసు, ఎంపీ నవాజ్ ఖని, ఎమ్మెల్యేలు ఎ.ఆర్.ఆర్.శ్రీనివాసన్, ఎస్.తంగపాండియన్, జి.అశోకన్, శివకాశి, కార్పొరేషన్ మేయర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.
సత్వర పరిష్కారమే లక్ష్యం