
వేలూరు వీఐటీలో ‘గ్రావిటాస్–25’
వేలూరు: పట్టణంలోని వీఐటీ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో జరి గే గ్రావీటాస్–25 కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హజరైన అబుదాబి రాష్ట్ర మంత్రి మజీద్ అలీ అల్లా మన్సూరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నూతన టెక్నాలజీలతో కూడిన పరిశోధనలు చేయడంలో శాస్త్ర వేత్తల ప్రయత్నం మరవలేనిదన్నారు. విద్యార్థులు టెక్నాలజీలో జీవించిన వారుగా ఉండాలన్నారు. గ్రావిటాస్ ద్వారా విద్యార్థుల మేధోశక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వేలూరు వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఇండియాలోని శాస్త్ర, సాంకేతిక, పరిశోధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక నిధు లు కేటాయించాలని అన్నారు. మూడు రోజులు జరిగే గ్రావిటాస్ కార్యక్రమం పరిశ్రమ, వ్యవసాయం, సర్వీస్ విబాగాలకు నూతన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు టెక్నాలజీ మారిన ఈ కాలంలో సైన్స్, టెక్నాలజీ అభివృద్ది ముఖ్య భాగం వహిస్తుందన్నారు. ఈ గ్రావిటాస్‌లో వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు 10 వేల మంది ఇతర యూనివర్సిటీలకు చెందిన మూడు వేల మంది మొత్తం 40 వేల మంది విద్యార్థులు కలుసుకుని 207కి పైగా పరిశోధనలను ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ: 30 లక్షల వ్యయంతో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా పలు పరిశోధనలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు అధిక సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసి ఉంచిన వివిధ పరిశోధనలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ కార్యనిర్వహన డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, మేక్సిమిస్ సీనియర్ ఉపాధ్యక్షులు ప్రవీణ, వీఐటీ వైస్ చాన్సలర్ కాంచన, అసోసియేట్ వైస్ చాన్సలర్ పార్థసారథి మల్లిక్, గ్రావిటాస్ కన్వీనర్‌లు, ఆర్గనైజర్‌లు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.