
రెబల్ చిత్ర దర్శకుడితో రాఘవ లారెన్స్
తమిళసినిమా: ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కాంచన–4 చిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇందులో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నట్లు, నటి రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయం అధికారికంగా వెల్లడించలేదన్నది గమనార్హం. ఈ చిత్రం తరువాత రాఘవ లారెన్స్ మరో చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు జీవీ.ప్రకాశ్‌కుమార్, నటి మమితా బైజూ జంటగా నటించిన రెబల్ చిత్రానికి నిఖిలేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్‌గా పెద్దగా ప్రభావం చూపలేదు. నిఖిలేశ్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర కథను ఇటీవల నటుడు రాఘవ లారెన్స్‌ను కలిసి దర్శకుడు వినిపించినట్లు, ఆయనకు కథ నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తుది దశ చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.