
వేడుకగా పెరటాసి మొదటి శనివారం
వేలూరు: తమిళ పెరటాసి మొదటి శనివారం పురష్కరించుకొని స్వామి వారి ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు. మొదటి శనివారం భక్తులు వేంకటేశ్వరస్వామికి ఉపవాసంతో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. వేలూరులోని టీటీడీ సమాచార మందిరంలో ఉదయం 5 గంటలకే స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. అదే విధంగా ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులుదీరారు. వేలూరుకు చెందిన ఒక భక్తుడు స్వామి వారికి 375 కిలోలతో అతి పెద్ద లడ్డు తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాడు. అదేవిధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాల్ ఆలయం, అరసంబట్టు పెరుమాల్ ఆలయం, బ్రహ్మపురంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయమూ భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్యపీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామిజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాల్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ చేశారు. తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి
చైన్నె షావుకారుపేటలో..
కొరుక్కుపేట: చైన్నె షావుకారుపేటలోని కుమరప్ప మేసీ్త్ర వీధిలోని ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలను అత్యంత వైభవంగా చేశారు. శ్రీవారిని వివిధ పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు గణపతి పూజతో పూజలను ప్రారంభించి అర్చన, ప్రసాద నివేదనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని గోవిందా గోవిందా అంటూ శ్రీవారి సేవలో తరించారు. వేంకటేశ్వరస్వామి సేవా సమాజం కార్యవర్గ సభ్యులు భక్తులందరికీ అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.
వైష్ణవ ఆలయాల్లో సందడి
పళ్లిపట్టు: పెరటాసి శనివారం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పవిత్ర పెరటాసి నెలలో ఐదు శనివారాలు భక్తులు స్వామిని దర్శించుకోవడం పరిపాటి. తొలి శనివారం సందర్భంగా ఇళ్లలో పూజలు చేసి స్వామిని దర్శించుకున్నారు. నెమిలిలోని వైకుంఠ వాస పెరుమాళ్ ఆలయంలో వేకువజామున స్వామికి అభిషేక పూజలు చేసి విశ్వరూప అలంకరణలో మహాదీపారాధన చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ పెరుమాళ్‌కు తిరుమంజన అభిషేక పూజలు చేశారు. రాత్రి స్వామివారిని గ్రామ వీధుల్లో విహరించారు. పళ్లిపట్టు బ్రాహ్మణ వీధిలోని వరదనారాయణస్వామి ఆలయంలో ఉదయం స్వామికి అభిషేక పూజలు చేసి తులసి ఆకులతో అలంకరణ చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. తిరుత్తణిలోని నంది నది తీరంలోని విజయరాఘవ పెరుమాళ్ ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా తిరుత్తణి, తిరువలంగాడు, ఆర్కేపేట, పళ్లిపట్టు ప్రాంతాల్లోని వైష్ణవ ఆలయాల్లో పురటాసి సందడి నెలకొంది.
పూజల్లో సేవా సమాజం సభ్యులు తోమాల అలంకరణలో వరదనారాయణస్వామి పెరుమాళ్‌కు తిరుమంజనం నిర్వహస్తున్న అర్చకులు

వేడుకగా పెరటాసి మొదటి శనివారం

వేడుకగా పెరటాసి మొదటి శనివారం

వేడుకగా పెరటాసి మొదటి శనివారం