
సమన్వయ.. వ్యూహాలు
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అన్నాడీఎంకే, బీజేపీ సమన్వయ వ్యూహాల రచనకు సిద్ధమ య్యాయి. ఆదివారం సేలంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో కమలనాథులు భేటీ అ య్యారు. సమష్టి కార్యాచరణకు నిర్ణయించాయి. అదే సమయంలో అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. వివరాలు.. తమి ళనాట అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలోకి బీజే పీ చేరిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో అ యితే, బిజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో అ న్నాడీఎంకే చేరినట్టుగా బీజేపీ నేతలు తరచూ వ్యాఖ్య ల తూటాలను పేల్చడం జరుగుతున్నది. తమిళనాట అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అన్న విషయా న్ని పదే పదే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆయన చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా వివరి స్తూ వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎన్ డీఏ కూటమి అంటూ వ్యాఖ్యలు చేస్తూ రావడమే కా కుండా, సంకీర్ణ ప్రభుత్వం అన్న వ్యాఖ్యల తూటాలను తరచూ పేలుస్తుండటం అన్నాడీఎంకే వర్గాలకు మింగుడు పడడం లేదు. ఇరు పార్టీల నేతలు తరచూ భిన్న స్వరాలు వ్యక్తం చేస్తుండడం కూటమిలో గందరగోళం తప్పడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా గళం విప్పిన సీనియర్ నేత సెంగోట్టయన్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ కావడం పళణి స్వామిని తీవ్ర సంకటంలో పడేసింది. దీంతో రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పళణి స్వామి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటి తదుపరి పరిణామాలతో ఆదివారం సేలంలోని పళణి స్వామి నివాసంకు కమలనాథులు వెళ్లడం ప్రాధాన్యతసంతరించుకుంది.
సమష్టి కార్యాచరణ..
సేలంలోని పళణి స్వామి నివాసంకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ నేతృత్వంలోని బృందం వెళ్లింది. సుమారు గంటన్నరకు పైగా ఇక్కడ సమావేశం జరిగింది. సమష్టి కార్యాచరణ, కూటమిలో ఇతర పార్టీలను చేర్చుకునే దిశగా కొత్త వ్యూహాలను రచించే రీతిలో ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కూటమిలో గందరగోళానికి ఆస్కారం ఇవ్వకుండా రాజకీయ కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చించినట్టు సమాచారం. అయితే సమష్టి వ్యూహాలు, కార్యాచరణ తదితర అంశాల గురించి పార్టీ వర్గాలతో చర్చించినానంతరం తదుపరి అడుగులు వేద్దామన్నట్టుగా పళని స్వామి సూచనలు చేసినట్టు చర్చ జరుగుతోంది. ఆ దిశగానే ముందుకు సాగే విధంగా బీజేపీ వర్గాలు సైతం అంగీకరించినట్టు తెలిసింది. అదే సమయంలో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం ఎన్‌డీఏలో ఇది వరకు కొనసాగడం, తాజాగా వారు బయటకు వెళ్లడం గురించిన ప్రస్తావనను పళణి స్వామి దృష్టికి కమలనాథులు తీసుకెళ్లినట్టు ప్రచారం. ఈ వ్యవహారంలో పళణి స్వామి ఎలాంటి సమాధానం అన్నది ఇవ్వకుండా గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానంటూ , వారికి అన్నాడీఎంకేలో చోటు లేనే లేదన్న సంకేతాన్ని తన మౌనం ద్వారా సమాధానం ఇచ్చినట్టుపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జోక్యం చేసుకోం..
పళణి స్వామితో భేటీ గురించి నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, మర్యాద పూర్వకంగా కలిసినట్టు పేర్కొన్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండబోరని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు ఉన్నాయని పేర్కొంటూ, అక్టోబరు 11 నుంచి తాను పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. మధ్యస్థం చేస్తారా? అని ప్రశ్నించగా, చూద్దాం అంటూ ముందుకెళ్లడం గమనార్హం. ప్రధాని మోదీ బర్త్‌డే సందర్భంగా జరిగిన మినీ మారథాన్‌లో పాల్గొనేందుకు వచ్చిన తాము సేలంలో పళణి స్వామి ఉండడంతో భేటీ అయ్యామన్నారు. రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పన్నీరు, దినకరన్ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా..? అని ప్రశ్నించగా, తమిళనాడును ఉత్తరం, దక్షిణం అని విభజించాల్సిన అవసరం లేదంటూ దాట వేశారు.
పళణి స్వామితో బీజేపీ నేతలు
పళణి స్వామితో నైనార్, అరవింద్ మీనన్

సమన్వయ.. వ్యూహాలు