
విజయ్ అబద్ధాల కోరు
– షనవాజ్ ఆగ్రహం
సాక్షి, చైన్నె: ఆధార రహిత వ్యాఖ్యలతో విజయ్ అబద్దాల కోరుగా అవతార మెత్తి ఉన్నారని వీసీకే ఎమ్మెల్యే షనవాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగపట్నం పర్యటనలలో తమిళగ వెట్రి కళగం నేత విజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. నాగపట్నంలో అభివృద్ధి శూన్యం అని విజయ్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగపట్నంలో దివంగత సీఎం జయలలిత పేరిట ఫిషరీస్ వర్సిటీ విజయ్‌కు కనిపించ లేదా? హార్బర్లు , చేపల దిగుమతి కేంద్రాల ప్రగతి కనిపించ లేదా? అని ప్రశ్నించారు. ఎవరో రాసి ఇచ్చిన దాన్ని చదివేస్తున్న విజయ్, అందుకు తగ్గ ఆధారాలు ఎందుకు చూపించడం లేదని ధ్వజమెత్తారు. తన ప్రచారంలో కేవలం డీఎంకేను మాత్రమే విజయ్ టార్గెట్ చేస్తుండటం చూస్తే, ఆయన వెనుక నడిపిస్తున్న వాళ్లు ఎవరో అన్నది స్పష్టమవుతోందన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, ఇది వరకే తాను విజయ్‌కు అనేక ప్రశ్నలు సంధించానని, వాటికి ఇంత వరకు సమాధానాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విజయ్ ప్రచారం తొలిరోజు థియేటర్లో పడే తొలి షో లాంటిదని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన, ఆధారాలు అన్నది కూడా లేకుండా ఆయన వ్యాఖ్యలు ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సెలబ్రటీ నటీ నటులు పబ్లిక్‌లోకి వస్తే జనం తరలి రావడం సహజమేనని వ్యాఖ్యలు చేశారు. ఇక, అన్నాడీఎంకే నేత రాజేంద్ర బాలాజీ స్పందిస్తూ, విజయ్ కేవలం డీఎంకేను మాత్రమే టార్గెట్ చేస్తున్నప్పడు అన్నాడీఎంకేలో చేతులు కలపవచ్చుగా అని పిలుపు నిచ్చారు. ఇక అదే పార్టీ నేత ఆర్‌బి ఉదయకుమార్ స్పందిస్తూ, పరీక్ష రాయనివ్వండి ఆతర్వాత పాస్ ఆర్ ఫెయిల్ చూసుకుందామని వ్యాఖ్యలు చేశారు. తన పై ముప్పెట దాడి నేపథ్యంలో విజయ్ స్పందిస్తూ, తాను సంధించే ప్రశ్నలతో పాలకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. సమాధానాలు ఇవ్వక పోగా, తన ప్రచారాలకు అడ్డు పడే రీతిలోవ్యూహాలు, కుట్రలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, నాగపట్నంలో విజయ్ పర్యటన సందర్భంగా మాత ఆలయం గోడను కూల్చేశారంటూ తమిళగ వెట్రి కళగం వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.