
అది రాజకీయ సమస్య
● అంగీకరిస్తేనే నిధులు ● కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
సాక్షి, చైన్నె: తమిళనాడులో సర్వ శిక్ష అభియాన్ నిధుల వ్యవహారం రాజకీయ సమస్యగా మారిందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఐఐటీ మద్రాసులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతోనే ఇక్కడ త్రిభాషా విధానాన్ని అమలు చేయకుండా వ్యతిరేకిస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని అమలు చేస్తున్నాయని వివరిస్తూ, సంకుచిత రాజకీయ దృక్పథం ఉన్న వారే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో ఆంగ్లం నేర్చుకుంటున్నప్పుడు, మరో భాషను మూడో భాషగా ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. సర్వ శిక్ష అభియాన్ నిధుల వ్యవహారం రాజకీయ సమస్యగా మారిందన్నారు. కేంద్రం ఒప్పందాన్ని అంగీకరిస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తనను తమిళనాడు విద్యామంత్రి అన్బిల్ మహేశ్, ఎంపీ కనిమొళి విద్యా పరమైన అంశాల గురించి కలిసినట్టు పేర్కొంటూ, తన వంతు సహకారం అందిస్తానని వ్యాఖ్యానించారు. అయితే నిర్బంధ విద్యాహక్కు చట్టం నిధుల గురించి ఆమంత్రే సమాదానం ఇవ్వాలన్నారు. తమిళనాడు వ్యాప్తంగా అనేక భాషలు మాట్లాడే వారు ఉన్నారని గుర్తు చేస్తూ, భాషా పరంగా విభజించాలనుకుంటే ఓటమి తప్పదని హెచ్చరించారు. ఇలాంటి విభజన వాదులను పక్కన పెట్టి సమాజం ముందుకెళ్తోందన్నారు. ఏ రాష్ట్రంపైన భాషను బలవంతంగా రుద్దడం లేదని, అటువంటి వాదనలు రాజకీయ ప్రేరేపితం అని వ్యాఖ్యలు చేశారు. పది శాతం మంది ఆంగ్లం మాట్లాడే వారు ఉన్నారని వ్యాఖ్యానించారు.
రేపు ఎంపీలతో భేటీకి నిర్ణయం
సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ ఈనెల 23వ తేదీన డీఎంకేకు చెందిన పార్లమెంట్, రాజ్యసభ సభ్యులతో భేటీకి నిర్ణయించారు. పార్టీ కార్యాలయంలోజరిగే ఈ సమావేశానికి ఎంపీలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ఆదివారం ఆదేశించారు.