
మీరు వృత్తిని మాత్రమే నిర్వహించడం లేదు..!
తమిళసినిమా: నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు నటుడిగా ఈయన రూటే సపరేటు తను తన పని మనదే ఈయన లోకం అయితే ఇటీవల కారు రేసుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అంతర్జాతీయ కార్ రేసుల్లో పాల్గొని పతకాలను గెలుచుకున్నారు. కాగా అజిత్ నటుడిగా 33 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తనకు ఈ రంగంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముఖ్యంగా తను ఈ స్థాయికి అభిమానులే కారణమని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే తన కోసం వారిని ఏ విధంగానూ వాడుకోవటం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాగా మంగళవారం అజిత్ సతీమణి, నటి శాలిని నటుడిగా 33 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన భర్త అజిత్ కు శుభాకాంక్షలు తెలిపారు. దీని గురించి ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ ‘‘ మీరు వృత్తిని మాత్రమే నిర్వహించలేదు. ప్రజల జీవితాలను మార్చి, అన్ని విధాలుగా మంచి చేశారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 33 ఏళ్లు నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు ‘‘ శాలిని అని పేర్కొని తన భర్త అజిత్ తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు .ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం తన 64వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.