
వసతులు కల్పించాలని కార్పొరేటర్ వినూత్న నిరసన
వేలూరు : వేలూరు కార్పొరేషన్‌లోని 49వ వార్డులో ఎటువంటి కనీస వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ అన్నాడీఎంకే కార్పొరేటర్ రోడ్డులో నిలిచి ఉన్న వర్షపు నీటిలో దొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. వేలూరు కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులుండగా అందులో అన్నాడీఎంకే కార్పొరేటర్ వార్డులు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన వార్డులకు మాత్రమే అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ కార్పొరేటర్లు ఉన్న వార్డుల్లో కనీసం విద్యుత్ లైట్లు కూడా వేయడం లేదని ఇప్పటికే పలుమార్లు కార్పొరేషన్ సమావేశంలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోయింది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో 49వ వార్డులోని వీధుల్లో పూర్తిగా వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. వీటిని చూసిన అన్నాడీఎంకే కార్పొరేటర్ లోకనాథన్ తన అనుచరులతో కలిసి బురద నీటిలోని వీధుల్లో దొర్లుతూ నిరసన తెలిపారు. తన వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మేయర్ సుజాత అడ్డుపడుతోందని విమర్శించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్పొరేటర్‌తో చర్చలు జరిపారు. మేయర్ సుజాత కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో స్థానికులు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాల వారిని అదుపు చేశారు. అనంతరం మేయర్ సుజాత మాట్లాడుతూ.. ఈ వార్డులో భూగర్బ డ్రైనేజీ పనులు జరుగుతున్నందున రోడ్డు పనులు చేయలేకపోయామని వారం రోజుల్లో రోడ్డు పనులు చేస్తామని హామీ ఇచ్చారు.