
డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు
● పన్నీరు స్పష్టం
సాక్షి, చైన్నె: డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయం అన్నది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి మాజీ సీఎం పన్నీరు సెల్వం సారథ్యంలోని కార్యకర్తల హక్కుల సాధన కమిటీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ రోజున ఉదయాన్నే ఓ సారి, సాయంత్రం మరో సారి సీఎం స్టాలిన్‌ను పన్నీరు సెల్వం కలవడం చర్చకు దారి తీసింది. పన్నీరు శిబిరం డీఎంకేతో జత కట్టబోతున్నట్టుగా ప్రచారం, చర్చలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితులలో ఈ వార్తలు, సమాచారాలకు చెక్‌పెట్టే విధంగా పన్నీరు సెల్వం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సీఎం స్టాలిన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి, పరామర్శించినట్టు వివరించారు. అలాగే ఆయన సోదరుడు ఎంకే ముత్తు ఇటీవల మరణించారని గుర్తు చేస్తూ, ఈ విషయంపై కూడా తన సానుభూతిని తెలియజేయడానికి వెళ్లానని పేర్కొన్నారు. ఈ భేటీ అన్నది తమిళ సంస్కృతి, సంప్రదాయంలో భాగమని, ఇందులో రాజకీయం అన్నది లేదన్నారు. తన తల్లి మరణించినప్పుడు, స్వయంగా సీఎం స్టాలిన్ వచ్చి తనను పరామర్శించి వెళ్లారని, ఓదార్చరని వివరించారు. అయితే దీనిని కొందరు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోనున్నామని, జత కట్టనున్నామని, కలిసి పయనించనున్నామని వస్తున్న వార్తలను ఖండిస్తున్నామన్నారు. తమిళ సంస్కృతిని రాజకీయం చేయడం తగదని, డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని, ఇంతటితో ప్రచారాలకు స్వస్తి పలకాలని కోరారు.