సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. శనివారం రాత్రి తూత్తుకుడి వేదికగా రూ.4,800 కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని చేయనున్నారు. తూత్తుకుడి కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఆదివారం గంగై కొండచోళపురంలో జరిగే ఆది తిరువాదిరై ఉత్సవ ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు. మోదీ పర్యటనతో తూత్తుకుడి, తిరుచ్చి, అరియలూరు జిల్లాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు.
అరియలూరు జిల్లా గంగై కొండ చోళపురం శివాలయాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించిన విషయం తెలిసిందే. తంజావూరులోని ప్రపంచ ప్రసిద్ధ్ది గాంచిన బృహదీశ్వరాలయం తరహాలో గంగై కొండ చోళపురం నిర్మితమై వెయ్యేళ్లు పూర్తయ్యింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని రాజేంద్ర చోళుడి జయంతిని తిరువాదిరై ఉత్సవాలుగా మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ముగింపు వేడుక జరగనుంది. పురాతన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. దీంతో ఆలయ పరిసరాలను సుందరంగా, శోభాయమానంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మ్యూజియం నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు.
రైల్వే ప్రాజెక్టులతో పాటు మరికొన్ని
ప్రభావవంతమైన ప్రాంతీయ కనెక్టివిటీ కోసం రూ.3,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనేక రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను దేశానికి తూత్తుకుడి నుంచే పీఎం అంకితం చేయనున్నారు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌లో విద్యుత్ ప్రసారం కోసం అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. తూత్తుకుడి వీఓ చిదంబరం పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రానికి రూ.1,030 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు. దక్షిణ తమిళనాడులో కనెక్టివిటీని బలోపేతం చేయడానికి మూడు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు. ఇందులో 90 కి.మీల మదురై–బోడినాయకనూర్ మార్గం పూర్తి చేసిన విద్యుద్దీకరణ పనులు, నాగర్‌కోయిల్ టౌన్–కన్యాకుమారి మధ్య 21 కి.మీ పూర్తి చేసిన రెండవ మార్గం పనులు, అరల్వాయ్‌మోళి–నాగర్‌కోయిల్, తిరునెల్వేలి–మేలపాళయంలో పూర్తి చేసిన డబ్లింగ్ పనులు ఉన్నాయి.
రేపు గంగై కొండ చోళపురానికి పయనం
నేడు తూత్తుకుడికి మోదీ రాక
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్నారు. మాల్దీవుల పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 8 గంటలకు తూత్తుకుడికి ప్రధాని రానున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో రూ.4,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం, క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, తమిళనాడు అంతటా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక రంగాల్లోని వివిధ ముఖ్యమైన ప్రాజెక్టులను దేశానికి ప్రధాని అంకితం చేయనున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి తన నిబద్ధతకు అనుగుణంగా, దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న విమానయాన అవసరాలను తీర్చడానికి రూ.450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. తూత్తుకుడి విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనం లోపల ప్రధాన మంత్రి నడిచి వెళ్లి సందర్శించనున్నారు. విమానాశ్రయాన్ని 17,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించారు. ఈ టెర్మినల్ రద్దీ సమయాల్లో 1,350 మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
తూత్తుకుడి పర్యటనను ముగించుకుని తిరుచ్చిలో రాత్రి ప్రధాని నరేంద్ర మోది బస చేయనున్నారు. ఉదయాన్నే గంగై కొండ చోళపురానికి హెలికాప్టర్‌లో వెళ్తారు. ఇందుకోసం హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇక్కడ 12 గంటలకు జరిగే తిరువాదిరై ఉత్సవాల ముగింపు వేడుకలో పాల్గొంటారు. ఇక్కడ ప్రధాని చేతుల మీదుగా మ్యూజియంతోపాటు తంజావూరు బృహదీశ్వరాలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే, సంగీత దర్శకుడు ఇళయరాజా సింఫోనికి సైతం ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ప్రధాని మోదీ రాకతో బీజేపీ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టే విధంగా సిద్ధమయ్యాయి. గంగై కొండ చోళపురం వెళ్లే మార్గంలో పీఎం రోడ్‌షో సాగే అవకాశాలు ఉన్నట్టు, ఇందుకోసం బీజేపీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. మోదీ పర్యటన దృష్ట్యా, తూత్తుకుడి, తిరుచ్చి, అరియలూరు జిల్లాలో భద్రతను పెంచారు. జిల్లా వ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
● నేడు తూత్తుకుడికి రాక ● రూ.4,800 కోట్ల అభివృద్ధి పనుల
● నేడు తూత్తుకుడికి రాక ● రూ.4,800 కోట్ల అభివృద్ధి పనుల
● నేడు తూత్తుకుడికి రాక ● రూ.4,800 కోట్ల అభివృద్ధి పనుల