
క్లుప్తంగా
అమ్మవారి ఆలయాల్లో
విశేష పూజలు
తిరుత్తణి: ఆడి నెల రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. తిరుత్తణి అక్కయ్య వీధిలోని తణికాచలమ్మ ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించి పుష్పాలతో అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి పసుపు, కుంకుమ పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంలోని మద్దూరు మహిషాసురమర్ధిని ఆలయంలో ఆడి రెండవ శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి చందనంతో అభిషేక పూజలు చేసి అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు స్వామిఅమ్మవారిని దర్శించుకున్నారు.
డీఎంకే నేత దారుణ హత్య
అన్నానగర్: దిండుగల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం డీఎంకే నేతను కారులో కిడ్నాప్ చేసి దారుణంగా నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. దిండుగల్ సమీపం నల్లంపట్టి మురుగన్ కావేరీ నగర్‌కు చెందిన మురుగన్ (56). డీఎంకేకు చెందిన ఈయన దిండిగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఈ పరిస్థితిల్లో బుధవారం ఒక ముఠా మురుగన్‌ను కారులో కిడ్నాప్ చేసింది. ఇతను మదురై జిల్లాలోని పాలమేడులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వెతికారు. కానీ అతను అక్కడ లేడు. ఈ పరిస్థితిల్లో గురువారం మధ్యాహ్నం, దిండుగల్ సమీపంలోని కనవైపట్టి సెంగురిచి రోడ్డులోని జోతంపట్టి అనే ప్రదేశంలో మురుగన్ కారు పార్క్ చేఉసి ఉందని చానర్‌పట్టి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, మురుగన్ కారులో కత్తితో పొడిచి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. జిల్లా ఎస్పీ ప్రదీప్, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మురుగన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మదురై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఈహత్యకు సంబంధించి మురుగన్ కారు డ్రైవర్ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పిన్‌హోల్ పపిల్లో ప్లాస్టీ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : లక్షలాది మందికి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యామ్నాయం పిన్ హోల్ పపిల్లో ప్లాస్టీని ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ ఆవిష్కరించారు. శుక్రవారం డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆస్పత్రిలో ఈ కొత్త ఆవిష్కరణను ప్రవేశ పెట్టారు. ఇది కార్నియల్ మార్పిడికి సరళమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని డాక్టర్ అమర్ అగర్వాల్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ కార్నియల్ మార్పిడి ప్రమాదకరం లేదా ఆచరణ సాధ్యం కాని అనేక సందర్భాల్లో సురక్షితమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందన్నారు. కనిష్ట ఇన్వాసివ్ శస్త్రచికిత్సా విధానంలో ఇన్‌న్‌కమింగ్ లైట్‌ను ఫిల్టర్ చేయడానికి ఐరిస్‌లో చిన్న, కస్టమ్–సైజ్ సెంట్రల్ ఓపెనింగ్ (పిన్‌హోల్) సృష్టించబడుతుందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి శస్త్రచికిత్సకు ముందు జాగ్రత్తగా అంచనా వేయడం చాలా అవసరం అన్నారు.
మహిళకు హత్యా బెదిరింపులు
–యువకుడి అరెస్ట్
తిరుత్తణి: మహిళకు హత్యా బెదిరింపులు చేసిన యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని వినాయకపురం గ్రామానికి చెందిన బాలాజి. ఇతని భార్య లత. వీరి కుమార్తె తిరుత్తణిలోని ప్రయివేటు పాఠశాలలో 6వ తరగతి చదువుకుంటున్నారు. బుధవారం ఉదయం కూతురిని బడికి పంపేందుకు స్కూలు బస్సు కోసం లత రోడ్డు వద్ద వేచివుంది. ఆసమయంలో అదే గ్రామానికి చెందిన శరత్‌కుమార్ (27) తనపై గతంలో వేసిన పోక్సో కేసును వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో దంపతులను హత్య చేస్తానని కత్తితో బెదిరించాడు. దీంతో లత తిరువళ్లూరులోని పోక్సో కోర్టులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు తిరుత్తణి మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి శరత్‌కుమార్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
ట్యాంక్‌ర్ ఢీకొని యువకుడి మృతి
తిరువొత్తియూరు: చైన్నె ఆదంబక్కంలో వాటర్ ట్యాంక్‌ర్ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఆదంబక్కం, సిటీ రింగ్‌రోడ్, ఎన్‌జీఓ కాలనీలోని పెట్రోల్ బంక్ దగ్గర నీటి ట్యాంకర్ ట్రాక్టర్ వెళుతోంది. ఆ సమయంలో ఆమార్గంలో వచ్చిన బైక్‌ను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌లో వెళుతున్న యువకుడు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా