
80 శాతం నిండిన పుళల్ సరస్సు
కొరుక్కుపేట: చైన్నె నగర ప్రజలకు దాహార్తిని తీరుస్తున్న తాగునీటికి ప్రధాన వనరు పూండి సరస్సు. ఈ సరస్సు ప్రస్తుతం 80 శాతం నిండింది. ఈ సరస్సు కృష్ణానదీ జలాల భాగస్వామ్య పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సమీపంలోని కండలేరు ఆనకట్ట నుంచి వర్షపునీటిని నిల్వ చేసి, అవసరమైనప్పుడు పుళల్, సెంబరంబాక్కం సరస్సులకు విడుదల చేస్తుంది. కృష్ణానదీ జలాల పంపకం పథకం ప్రకారం మే 21 నుంచి కండలేరు ఆనకట్ట నుంచి పూండి సరస్సుకు నీరు వస్తోంది. పూండి సరస్సు నుంచి పుళల్ సరస్సుకు నిరంతరం నీటిని పంపుతున్నారు. కాలువలోకి 300 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పుళల్ సరస్సులో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి పుళల్ సరస్సులో నీటి మట్టం 80 శాతం ఉందని అధికారులు వెల్లడించారు.
అన్నదమ్ముల
దారుణ హత్య
తిరువొత్తియూరు: పుదుక్కోట్టై జిల్లాలో అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. అరంతంగి సమీపంలోని ఆవుడైయార్ కోవిల్ కామరాజ్‌పురానికి చెందిన కన్నన్ (35), కార్తీక్ (29) అన్నదమ్ములు. వీరిద్దరు కార్మికులు. కన్నన్‌కు ఏడాది క్రితం వివాహమైంది. కార్తీక్‌కు ఇంకా పెళ్లి కాలేదు. వీరిద్దరూ గురువారం రాత్రి 11 గంటలకు అడియార్‌గుళం గట్టుపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆవుడయ్యార్ కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వైగో ప్రచార సభలు
ఆగస్టు 9 నుంచి శ్రీకారం
సాక్షి, చైన్నె: ఎండీఎంకే నేత వైగో తమిళ ప్రజల హక్కుల పరిరక్షణ నినాదంతో ప్రచార సభలకు సిద్ధమయ్యారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ ప్రచార సభలు ఎనిమిది చోట్ల నిర్వహించనున్నారు. ఎండీఎంకే నేత వైగో రాజ్యసభలో అందించిన సేవలు గురించి తెలిసిందే. ఆయన పదవీ కాలం గురువారంతో ముగిసింది. ఇక, మళ్లీ రాజ్యసభ అవకాశాలు దక్కేనా అనేది అనుమానమే. ఆయన పదవీ విరమణ చేసినంతగా ఆ పార్టీ వర్గాలు ఢిల్లీ నుంచి వచ్చిన తమ నేతకు బ్రహ్మరథం పట్టే ఆహ్వానం శుక్రవారం పలికారు. డీఎంకే కూటమి బలాన్ని చాటేవిధంగా ఎండీఎంకే ప్రచార సభలపై దృష్టి పెట్టనున్నట్టు వైగో తరఫున పార్టీ కార్యాలయం ప్రకటించింది. ఆగస్టు 9న తూత్తుకుడిలో స్టెరిలైట్‌కు వ్యతిరేక నినాదంతో ప్రచార సభ ప్రారంభం కానుంది. 10న తెన్‌కాశి జిల్లా కడయనల్లూరులో, 11న కంబంలో, 12న దిండుగల్‌లో, 13న కుంభకోణంలో, 14న తిరునల్వేలిలో, 18న తిరుప్పూర్‌లో, 19వ తేదీన చైన్నె తిరువాన్మియూరులో ప్రచార సభలకు వైగో నిర్ణయించారు. ఓ వైపు వైగో బలోపేతం దిశగా ప్రచార సభలకు సిద్ధమైతే, ఆ పార్టీ అసంతృప్తి నేత మల్లైసత్య తనను ద్రోహిగా అధినేత అభివర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ, తన బలాన్నిచాటే విధంగా చైన్నెలో నిరసన సభకు సిద్ధం కావడం గమనార్హం. ఈ సభకు అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం చైన్నె పోలీసులను ఆయన ఆశ్రయించారు.
కాషాయానికి చోటులేదు
సాక్షి, చైన్నె: తమిళనాడులో కాషా యానికి చోటులేదని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. వీరి వ్యూహాలను భగ్నం చేద్దామని యువజనులకు పిలుపునిచ్చారు. డీఎంకే యువజన విభాగం నేతలతో శుక్రవారం ట్రిప్లికేన్‌లో ఉదయనిధి సమావేశమయ్యారు. డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా సమావేశానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ, కొన్ని పార్టీలు ఇంతవరకు బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అయితే, బూత్ కమిటీలనేకాదు, డిజిటల్ ఏజెంట్లను సైతం నియమించి కార్యక్రమాలను డీఎంకే విస్తృతం చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజనులపై ఉందన్నారు. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయా లని బీజేపీ వ్యూహం పన్నుతోందని, ఇక్కడ కాషాయంకు చోటు లేదని నిరూపించే విధంగా వారి వ్యూహాలన్నీ భగ్నం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

80 శాతం నిండిన పుళల్ సరస్సు