
24 శాతం పెరిగిన ఇండియన్ బ్యాంక్ లాభం
కొరుక్కుపేట: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 24 శాతం నికర లాభం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.2,403 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని ఆ బ్యాంక్ సీఈఓ బినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బ్యాంక్ ఫలితాలను ప్రకటించిన ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆశాజనకమైన ఫలితాలను నమోదు చేసిందన్నారు. 2025–26 జూన్ 3 తేదీతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.18,721 కోట్లకు పెరిగిందన్నారు. 2025 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన వడ్డీ రూ.15,039 కోట్ల నుంచి రూ.16,283 కోట్లకు పెరిగిందన్నారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,502 కోట్ల నుంచి రూ.4,770 కోట్లకు పెరిగింది. అలాగే మొదటి త్రైమాసికంలో కేటాయింపులు, ఆకస్మికాలు గణనీయంగా తగ్గి రూ.691 కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇది గత సంవత్సరం రూ.1,258 కోట్లుగా ఉందన్నారు. కేటాయింపు కవరేజ్ నిష్పత్తి 96.66 శాతం నుంచి 98.2 శాతానికి మెరుగుపడిందన్నారు.