
ఉపాధ్యాయులూ తల్లిదండ్రుల్లాంటి వారే!
● మంత్రి అన్బిల్‌మహేష్
తిరువళ్లూరు: విద్యార్థులకు ఉపాధ్యాయులూ తల్లిదండ్రులు లాంటి వారనే విషయాన్ని గుర్తించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేష్ విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరులోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జిల్లాలోని ప్రఽభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రి అన్బిల్‌మహేష్, కలెక్టర్ ప్రతాప్ హాజరై రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న అచీవ్‌మెంట్ టెస్టుపై సమీక్షను నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర స్థాయి అచీవ్‌మెంట్ టెస్టులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ టెస్టుల్లో 3,5,8 తరగతులకు చెందిన విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఆసక్తి వున్న విద్యార్థులను గుర్తించి జాతీయ స్థాయి పరీక్షలకు సైతం పంపాలని కోరారు. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో తిరువళ్లూరు 15వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది మరింత మెరుగైన పలితాలను సాధించాలని కోరారు. ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ ఎక్కడ అందుబాటులో వున్నా వాటిని పరిశీలించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో తీసుకుని రావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పది, ప్లస్‌టూ పరీక్షల్లో మొదటి పది స్థానాల్లో నిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 13 పాఠశాలల్లో రూ.2కోట్లతో స్మార్ట్ క్లాసులను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాటు విద్యార్థుల అభ్యసన శక్తిని మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన గ్రీనరీ పాఠశాలను సైతం ఆయన ప్రారంబించారు. ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పాఠశాల జాయింట్ డైరెక్టర్ అముదవల్లి, సీఈఓ తేన్‌మెళి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.