
రాజకీయ నేపథ్యంగా శక్తి తిరుమగన్
తమిళసినిమా: విజయ్‌ఆంటోనీ కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం మార్గన్. ఇటీవల విడుదలై విజయాన్ని అందుకుని 25వ రోజుకు చేరుకుంది. తాజాగా హీరోగా నటించి, సంగీతాన్ని అందించిన చిత్రం శక్తితిరుమగన్. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై మీరా ఆంటోనీ నిర్మించిన ఇందులో త్రిప్తి నాయకిగా నటించారు. అరువి, వాళ్ చిత్రాలు ఫేమ్ అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది విజయ్ ఆంటోని నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా గురువారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శక్తి తిరుమగన్ చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న తరహాలో ఒలింపిక్ క్రీడలను వెలుగుతున్న కాగడాతో ప్రారంభించినట్లు గన్ పేల్చి యూనిట్ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ఆంటోని బిరియాని కట్ చేయడం విశేషం. అదే విధంగా వేదికపై తాబేలును శాలువాతో సత్కరించారు. అనంతరం విజయ్‌ఆంటోని చిత్రం గురించి మాట్లాడుతే అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన అరువి చిత్రం చూసి మూడు సార్లు కంటతడి పెట్టానన్నారు. ఇది ప్రజల రాజకీయ కథా చిత్రం అని అన్నారు. ఈచిత్రంలో కథానాయకి త్రిప్తి రొమాన్‌న్స్ సన్నివేశాలు ఉంటాయన్నారు. మరాఠీ నటి అయిన ఆమెను ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.