
విజయ్ వారసుడి తొలి చిత్రం చివరి దశకు..
తమిళసినిమా: నటుడు విజయ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకున్న స్టార్ హీరో విజయ్. ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఇదే విజయ్ చివరి చివరి చిత్రం అంటున్నారు. కాగా చిత్ర పరిశ్రమలో విజయ్ ఎగ్జిట్ ఆయన వారసుడు జెసన్ సంజయ్ ఎంట్రీగా మారుతోంది. కెనడాలోని టోరంటో ఫిలిం స్కూల్ లో చిత్ర నిర్మాణం డిప్లమో, లండన్‌లో చిత్ర కథనానికి సంబంధించి సీఎం హానర్స్ విద్యను పూర్తి చేశారు. కాగా ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన ఈయన తాజాగా మెగా ఫోన్ పట్టి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం కోసం పలువురు హీరోలను సంప్రదించి చివరికి సందీప్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం చైన్నెలో జరుపుకుంది. కాగా చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. మరో రెండు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ వర్గాల సమాచారం. దీంతో విజయ్ వారసుడు జెసన్ సంజయ్ తొలి చిత్రంపై ఆసక్తి నెలకొనడం సహజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.