భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు! | - | Sakshi
Sakshi News home page

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

Jul 21 2025 5:43 AM | Updated on Jul 21 2025 5:43 AM

భక్త

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

తిరుత్తణిలో పోటెత్తిన భక్తజనం

ఆడి మాసంలో వచ్చే తొలి కృత్తిక రోజు ఆదివారం రావడంతో ఆరుపడై వీడులే కాదు, రాష్ట్రంలోని మురుగన్‌ ఆలయాలన్ని భక్తులతో నిండాయి. ఉదయం నుంచి ఆలయాల్లో విశిష్ట పూజలు జరిగాయి. వళ్లి, దేవానై సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు.

ఆలయాల్లో విశేష పూజలు

మార్మోగిన హరోహర

సాక్షి, చైన్నె: తమిళ్‌ కడవుల్‌ మురుగన్‌కు ప్రసిద్ధి చెంది న ఆరుప్పడై వీడులుగా పిలవబడే ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో జయంతి నాథర్‌ స్వామిగా, దిండుగల్‌ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రంలో సుబ్రమణ్యస్వామిగా, తంజావూరు జిల్లా స్వామి మలైలోని స్వామినాథన్‌గా, మదురై పళముదిర్‌ చోళైలో సోలై మలై మురుగన్‌, తిరుత్తణిలో మురుగన్‌ తమిళ్‌ కడవుల్‌ వెలిసి ఉన్నారు. ఈ ఆలయాలలో తైపూసం, స్కంధ షష్టి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. అలాగే ఆడి నెలలో ఆడి కృత్తిక మహోత్సవాలు మిన్నంటుతాయి. తమిళనాట ఆడిమాసం(ఆషాడం) వస్తే చాలు తమిళనాడులో భక్తి భావం మిన్నంటు తుంది. ఈ మాసంలో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. చిన్న, పెద్ద ఆలయాలే కాదు, గ్రామ దేవతల ఆలయాలు, వీధులలోని అమ్మవారి ఆలయాలలో ఉత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. ఈనెలలో వచ్చే ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆడి మాసంలో కృత్తిక రోజు ఆదివారం రావడంతో భక్తులంతా మురుగన్‌ ఆలయాల బాటపట్టారు. కృత్తిక రోజు మురుగన్‌కు విశిష్ట పర్వదినం కావడంతో భక్తులంతా ఆరుపడై వీడులతోపాటూ రాష్ట్రంలోని మురుగన్‌ ఆలయాలలో ప్రత్యేక పూజలలో లీనమయ్యారు. కావళ్లతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులతో కిటకిట

తమ ఆరాధ్య దైవానికి దర్శించుకునేందుకు తమిళులు ఆరుపడై వీడుల వైపుగా కదిలారు. సెలవు రోజు కావడంతో ఆలయాలన్నీ భక్తులతో నిండాయి. కిలో మీటర్ల కొద్ది బారులుదీరి మరీ వళ్లి దేవానై సమేత సుబ్రమణ్య స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని ఆలయాల్లో హరోహర నామస్మరణ మిన్నంటింది. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయంలో వేకువ జామున నుంచే పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. రెండు వారాల క్రితమే ఇక్కడ కుంభాభిషేకం జరిగింది. ప్రస్తుతం 30 రోజుల మండల పూజలు జరుగుతున్నాయి. దీంతో భక్తులతో సాగర తీరం నిండింది. విశ్వరూప జ్యోతి దర్శనం జరిగింది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. తరలి వచ్చిన భక్తులు తిరుచెందూ రు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కూత వేటు దూ రంలో ఉన్న సముద్రంలో పవిత్ర స్నానాలు చేశారు. అక్కడి బావి నీటిని చల్లుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోడ్‌ జిల్లా గోబి చెట్టి పాళయం పచ్చమలై సుబ్రమణ్య స్వామి ఆలయం ప్రత్యేక పూజలు కనుల పండువగా జరిగింది. సెన్నిమలై మురుగన్‌ ఆలయం, నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడులో ఆర్ముగస్వామి ఆలయం, చైన్నె వడపళణిలోని మురుగన్‌ ఆలయం, చైన్నె శివారులోని వెల్లకోట్టై మురుగన్‌, తిరుప్పోరూర్‌ మురుగన్‌ ఆలయంల వద్ద స్వామి దర్శనానర్థం ఉదయాన్నే భక్తులు కిలో మీటర్ల కొద్ది బారులుదీరారు. దీంతో ఆ పరిసరాలు వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కింది. దిండుగల్‌ జిల్లా పళనిలో దండాయుధ పాణి స్వామి ఆలయంలో బ్రహ్మాండ పూజలతో స్వామి వారిని దర్శించకునేందుకు భక్తులు పోటెత్తారు. వళ్లి, దైవానై సమేత దండాయుధ పాణిగా ముత్తుకుమార స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. విశిష్ట పూజలలో పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. గత వారం కుంభాభిషేకం జరుపుకున్న తిరుప్పర కుండ్రం మురుగన్‌ ఆలయానికి సైతం భక్త జనం పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ హరోహర నామస్మరణతో మారుమోగాయి.

తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆడినెల తొలి కృత్తిక సందర్భంగా భక్తులు కావళ్లతో పోటెత్తారు. ఈ సందర్భంగా కొండ ఆలయంలో కావళ్ల సందడి కనువిందు చేసింది. భారీ క్యూలలో నాలుగు గంటల పాటు వేచివుండి కావళ్లు చెల్లించి భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈ ఏడాది ఆడి నెలలో రెండు కృత్తికలు రావడంతో తిరుత్తణి ఆలయంలో ఆగస్టు 16న ఆడికృత్తిక వేడుకలు నిర్వహిస్తారు. అయితే తొలి ఆడికృత్తికలో కావళ్లు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. కొండకు కావళ్లతో భక్తులు ఆదివారం వేకువజాము నుంచి పోటెత్తారు. మెట్ల మార్గం, ఘాట్‌రోడ్డు మార్గాలు నిండి కొండ మాడ వీధులు కిక్కిరిశాయి. దీంతో అతి తక్కువ సంఖ్యలో విధులు నిర్వహించిన పోలీసులు చేతులెత్తేశారు. ఉచిత దర్శనం క్యూలైన్‌ నిండగా రూ.100 ప్రత్యేక దర్శన క్యూలైన్‌ సైతం విపరీతమైన రద్దీ నెలకొంది. వీఐపీ గేట్‌ ద్వారా స్వామి దర్శనానికి భక్తులు క్యూకట్టడంతో తోపుసలాట చోటుచేసుకుని చిన్నారులు, వృధ్దులు, మహిళలు ఇబ్బందులు చెందారు. ఉచిత దర్శన మార్గంలో నాలుగు గంటలు, రూ. 100 దర్శన మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసి కావళ్లు చెల్లించారు. తిరుత్తణి ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి ఆధ్వర్యంలో వీఐపీ గేటు వద్ద భక్తులను కంట్రోల్‌ చేసే ప్రయత్నం కుదరక పోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలియక పోవడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేక పోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చిందని, ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు కావళ్లతో పోటెత్తడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

వాహనాలు నిలిపివేత

తిరుత్తణికి వాహనాల్లో వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఘాట్‌రోడ్డులో వాహన సేవలు ఉదయం 7 గంటలకే స్తంభించాయి. దీంతో కొండ ఆలయంకు వాహనాలను నిషేధించి కొండ కింద భాగంలో పార్కింగ్‌ చేసి ఆలయ బస్సులతో పాటు నడిచి వెళ్లాలని ఆలయ అధికారులు సూచించారు. పార్కింగ్‌ ప్రాంతాలన్నీ నిండడంతో మధ్యాహ్నం పట్టణంలో ట్రాఫిక్‌ స్తంభించింది.

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!1
1/4

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!2
2/4

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!3
3/4

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!4
4/4

భక్త జన సంద్రమైన ఆరుపడై వీడులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement