
అధికారంలో భాగస్వామ్యం కల్ల
● కూటమిపై పళణి సంచలన వ్యాఖ్యలు
●బీజేపీలో టెన్షన్
సాక్షి, చైన్నె: సంకీర్ణం ప్రభుత్వం పేరిట బీజేపీకి అధికారంలో వాటా ఇవ్వడానికి తామేమీ ముర్ఖులం కాదని, బుద్ధిమంతులమే అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త బీజేపీ వర్గాల్ని టెన్షన్‌లో పడేసినట్లయ్యింది. వివరాలు.. తమిళనాడుచరిత్రలో సంకీర్ణ ప్రభుత్వానికి ఇంత వరకు ఆస్కారం ఇవ్వలే. డీఎంకే, అన్నాడీఎంకేలు మార్చి మార్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం కూడా సంపూర్ణ మెజారిటీతో డీఎంకే అధికారంలో ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వం గ్యారంటీ అన్న నినాదం తాజాగా మిన్నంటుతోంది. ఇందుకు కారణం బీజేపీ కీలకనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య లే. అన్నాడీఎంకే – బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని, తమిళ నాట రానుంది సంకీర్ణ ప్రభుత్వమే అఽని ఆయన స్పష్టం చేశారు. ఈ నినాదం ప్రస్తుతం అందరి నోటా నానుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలో వాటాలుంటాయనే చర్చ జోరందుకుంది. అదే సమయంలో బీజేపీ నేతలు అయితే, మరింతగా సంకీర్ణ నినాదాన్ని అందుకుంటూ వస్తున్నారు. దీనిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి పరోక్షంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తమిళనాట అన్నాడీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, సంపూర్ణ మెజారిటీతో తాము అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా, సంకీర్ణ నినాదం అన్నది అన్నాడీఎంకే కూటమిలో సద్దుమనిగినట్టు లేదు. తాజాగా తమిళనాడును, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణి స్వామి చేస్తున్న ప్రజాచైతన్య యాత్ర ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తిరువారూర్ జిల్లా తిరుత్తురై పూండిలో పళణి స్వామిచేసిన వ్యాఖ్యలు బీజేపీకి ముచ్చమటలు పట్టించేలా మారాయి. బీజేపీతో అన్నాడీఎంకే బంధం ఎన్నికల వరకు సాగేనా అన్నట్టుగా పరిస్థితులు చర్చకు దారి తీశాయి.
పళణి ఏమన్నారంటే..
పళణి స్వామి మాట్లాడుతూ సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యల తూటాలను పేల్చారు. అసెంబ్లీ వేదికగా తనను స్టాలిన్ ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులోనూ బీజేపీతో పొత్తు లేదన్న వాళ్లు ఇప్పుడెందుకు కూటమిలో చేరారు? అని ఆయన తనను ఉద్దేశించి ప్రశ్నించగా, ఇది తమ పార్టీ అన్నాడీఎంకే అని, తమ ఇష్టం అని తాను స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. అదే సమయంలో కూటమి ఎవరో పెట్టుకోవాలో, ఎవర్ని బయటకు పంపించాలో తమ ఇష్టం అని, దీనిపై స్టాలిన్‌కు భయం ఎందుకో అని ప్రశ్నించారు. అన్నాడీఎంకేతో బీజేపీ జత కట్టడంతో స్టాలిన్‌తో తెలియని భయం అన్నది రెట్టింపు అయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పళణిస్వామి చేసిన వ్యాఖ్య బీజేపీ వర్గాలకు షాక్‌గా మారింది. 2026 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం అంటూ బీజేపీకి వాటా ఇవ్వడానికి తామేమీ ముర్ఖులం కాదని, బుద్ధిమంతులమే అంటూ స్టాలిన్‌కు సమాధానం ఇచ్చే విధంగా వ్యాఖ్యల తూటాను పేల్చారు. అన్నాడీఎంకే ఎవరితో అయినా కూటమి పెట్టుకుంటుందని, వద్దంటే బయటకు ..కావాలంటే లోనికి వెళ్తుందంటూ చమత్కరించారు. కూటమి కావాల..వద్దా..? అని తామే తేల్చుకుంటామని, ఇందులో స్టాలిన్‌కు ఏమిటో అంత అత్యుత్సాహం అని ఎద్దేవా చేశారు. తన రాజకీయ వారసుడి అభ్యున్నతి కోసం స్టాలిన్ పరుగులు తీస్తున్నారని, తాము ప్రజల పక్షాన నిలబడి శ్రమిస్తున్నామన్నారు. ప్రజల మీద నమ్మం తమకు ఎక్కువేనని, వారు తమను గెలిపిస్తారని, అధికారం అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా ఉండే ఏకాభిప్రాయం కలిగిన పార్టీలు ఏదైనా సరే తమతో చేతులు కలుప వచ్చని పిలుపునిచ్చారు. మరిన్ని పార్టీలు సరైన సమయంలో అన్నాడీఎంకే కూటమిలోకి వస్తాయని, 2026లో డీఎంకే ప్రభుత్వానికి మరణ శాసనం రాస్తాం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.