
అప్పు తీర్చడానికి కిడ్నీలు విక్రయం
అన్నానగర్: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయం ప్రాంతానికి చెందిన ఆరుగురు మహిళలకు మాయమాటలు చెప్పి.. కిడ్నీలు తొలగించిన ఘటన కలకలం రేపింది. పరారీలో ఉన్న బ్రోకర్ ఆనందన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం కిడ్నీలు దానం చేసిన ఇద్దరు మహిళలను మాత్రమే గుర్తించారు. వారి వాంగ్మూలాలలో.. నిందితులు తమ కిడ్నీలను తీసుకొని రూ.6 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పల్లిపాళయంకు చెందిన ఒక కూలీ తన కిడ్నీ అమ్ముకున్నట్లు జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం పల్లిపాళయం సందర్శించి పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించనుందని ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.
నాంగునేరి సిప్‌కాట్ కోసం
రూ. 872 కోట్లు
సాక్షి, చైన్నె: తిరునల్వేలి జిల్లా నాంగునేరిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 872 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడుల ఆహ్వానం దిశగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా దక్షిణ తమిళనాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తిరునల్వేలి జిల్లా నాంగునేరిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పారిశ్రామిక వాడ కోసం 2 వేల ఎకరాల స్థలాలను ప్రైవేటు వ్యక్తులు నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మిగిలిన స్థలం ప్రభుత్వం గుప్పెట్లో ఉండటంతో సుమారు 3 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలోఅతి పెద్ద పారిశ్రామిక వాడకు సిద్ధమయ్యారు. ఈ పనులకు , స్థల కొనుగోలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 872 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రిలోకి చొరబడి..
● చైన్నెలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
అన్నానగర్: కులితలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలిని ఆమె భర్త కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. కరూర్ జిల్లాలోని కులితలై పట్టవర్తి నివాసి విశ్రుత్ (30) చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అతను చైన్నెకి చెందిన శ్రుతి (27)ని ప్రేమించి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వారు ప్రస్తుతం కులితలై పట్టవర్తిలో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విశ్రుత్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రుతి తిరుచ్చి జిల్లాలోని ముసిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారి కుమారులు కూడా అక్కడే చదువుతున్నారు. శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో విశ్రుత్ శృతిపై దాడి చేశాడు. గాయపడిన శృతిని కులితలై ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‌గా చేర్చారు. ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశ్రుత్ ఆదివారం ఉదయం తన భార్యను చూడటానికి అస్పత్రికి వెళ్లాడు. తరువాత, తన కోపాన్ని ఆపుకోలేక, తాను దాచుకున్న కత్తిని తీసి, శ్రుతి మెడ, భుజంపై వరుస కత్తిపోట్లతో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మరణించింది. కులిత్తలై పోలీసులు శృతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విశ్రుత్ కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించిన భర్త భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది.
పేలిన కారు టైర్!
● ఒకే కుటుంబంలోని నలుగురి మృతి
సాక్షి, చైన్నె: అతివేగంగా వెళ్తున్న కారు టైర్ పేలి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఆదివారం కళ్లకురిచ్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురానికి చెందిన సాయుధ బలగాల విభాగం పోలీసు అధికారి మాధవన్(44), ఆయన భార్య సంగీత దంపతులు బంధువులతో కలిసి కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి దర్శనానికి ఉదయాన్నే బయలుదేరారు. కళ్లకురిచ్చి జిల్లా తిరుక్కోవిలూరు సమీపంలోని అత్తి పాక్కం వద్ద కారు టైర్ పేలింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారును మాధవన్ అదుపు చేయలేక పోయాడు. దీంతో కారు రోడ్డు పక్కనే గోతిలో పడింది. ఈ ప్రమాదంతో ఆ పరిసర వాసులు ఉరకలు తీశారు. క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉలుందూరు పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మరణించిన వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో మాదవన్ సతీమని సంగీత, అత్త ధనలక్ష్మి, బంధువులు సుభా, రాఘవేంద్రన్ ఘటనా స్థలంలోనే మరణించారు. మాధవన్‌తో పాటూ మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి తిరువణ్ణామలై ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉలందూరు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.