
అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కింపు నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 10న పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సోమవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి వారి సన్నిధి, అమ్మవారి ఆలయం, వినాయకుడి ఆలయం ఇతర ప్రాంతాల్లోని 22 హుండీలలోని భక్తులు వేసిన కానుకలను ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. లెక్కింపులో రూ.4 కోట్ల 73 లక్షల నగదు, 116 గ్రాముల బంగారం, 2,438 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ జెసి తెలిపారు. ఈ నగదును ప్రభుత్వ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. లెక్కింపులో దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ జీవానందం పాల్గొన్నారు.