
చిత్ర ప్రమోషన్ ప్రధానంగా మారింది
తమిళసినిమా: ఎంఎన్‌ఆర్ పిక్చర్స్ పతాకంపై ఎం.నాగరత్నం నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం వళ్లిమలై వేలన్. ఇళక్కియ నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ కథ, దర్శకత్వం వహించారు. ఆల్డ్రిన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, దర్శకుడు వి.శేఖర్, సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు వి.శేఖర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రాన్ని రూపొందించడం సులభమని, ప్రమోషన్ చేయడం ప్రధానంగా మారిందన్నారు. తాము చిత్రాలు చేస్తున్న కాలంలో 250 థియేటర్ల వరకు లభించేవని, ఇప్పుడు పెద్ద చిత్రాలకు 1000 థియేటర్లకం పైగా కేటాయిస్తున్నారని, దీంతో చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదన్నారు. ఈ విధానం మారాలని అన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని దర్శకుడు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు కుమారస్వామి సీజన్ నడుస్తోందని, ఆయన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారని అన్నారు. ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు కథకు తగ్గట్టుగా ఉన్నారని ఆయన ప్రశంసించారు. తాము చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంటుందనే అభిప్రాయాన్ని చిత్ర నిర్మాత, కథానాయకుడు ఎం.నాగరత్నం వ్యక్తం చేశారు.