
వైభవం..మునీశ్వర్ మహాకుంభాభిషేకం
తిరుత్తణి: మునీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సమీపంలోని ఎస్.అగ్రహారం గ్రామంలో ఎల్లయమ్మన్ గుంట వద్ద 11 అడుగుల ఎత్తులో మునీశ్వర్ విగ్రహం ప్రతిష్టించారు. విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు సందర్భంగా యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహోమగుండ పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మునీశ్వరర్ విగ్రహానికి పుణ్యతీర్ధాలతో మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులపై పుణ్యతీర్థాలు చల్లారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.