
సీఎస్‌బీఎస్ ఒప్పందం కీలకం
తిరువళ్లూరు: టీసీఎస్‌తో ప్రత్యూష కళాశాల కుదుర్చుకున్న కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒప్పందం ద్వారా భవిషత్తులో నైపుణ్యవంతమైన ఇంజినీర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌కుప్పంలోని ప్రత్యూష్ కళాశాల సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌తో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్‌పై కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సంబంధిత ఒప్పందంపై టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్, ప్రత్యూష్ కళాశాల చైర్మన్ రాజారావ్ పరస్పర అంగీకారంతో సంతకం చేశారు. చైర్మన్ రాజారావ్ మాట్లాడుతూ పరస్పర సహకారంతో విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సీఎస్‌బీఎస్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల నిఫుణుల నుంచి మార్గదర్శకత్వం, ఆచరణాత్మక శిక్షణ, ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి సీఎస్‌బీస్ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్లేస్‌మెంట్ డైరెక్టర్ హైమావతి పాల్గొన్నారు.