
రాందాసు సామాజిక మాధ్యమాలు హ్యాక్
● డీజీపీకి ఫిర్యాదు ● పార్టీకి నేనే భవిష్యత్తు అని వ్యాఖ్య
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీనిపై ఆన్‌లైన్ ద్వారా డీజీపీకి ఆయన తరపున శనివారం ఫిర్యాదు చేశారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సాగుతూ వచ్చిన సమరం ప్రస్తుతం డిజిటల్ వార్‌కు పరిస్థితులు కల్పించి ఉన్నాయి. తన నివాసంలో ట్యాపింగ్ పరికరం వెలుగు చూసినట్టుగా రాందాసు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తన సోషల్ మీడియా ఖాతాలన్నీ హ్యాక్ చేసినట్టు రాందాసు ప్రకటించారు.దీనిని హ్యాక్ చేసిన వారిని గుర్తించిచర్యలు తీసుకోవాలని రాందాసు డిమాండ్ చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది ఓ వైపు ఉంటే, మరో వైపు కేడర్‌కు రాందాసు లేఖ రాశారు. పీఎంకేకు భవిష్యత్తు తానే అని స్పష్టం చేశారు. పీఎంకే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టానని, మరింత దూకుడుగా ముందుకెళ్తామని సూచించారు. 40 స్థానాలలో అభ్యర్థుల గెలుపు దిశగా ఉరకలు తీద్దామని కేడర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, రాందాసు నివాసంలో లండన్‌లోని కొనుగోలు చేసినట్టుగా పేర్కొన్న ట్యాపింగ్ పరికరం గురించి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్బుమణి డిమాండ్ చేశారు.