
ఆగస్ట్ 1న తెరపైకి సరెండర్
తమిళసినిమా: నటుడు దర్శన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరెండర్. లాల్, సుజిత్ శంకర్, మునీష్‌కాంత్, పళనికుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్‌వీ.కుమార్ నిర్మించారు. ఈచిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ వద్ద అసోసియేట్‌గా పనిచేశారన్నరది గమనార్హం. వికాశ్‌పడిశ సంగీతాన్ని, మెయ్యేంద్రన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఆగస్ట్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎన్నికలకు ముందు 5 రోజుల్లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఒక పోలీస్‌స్టేషన్‌లో ఒక మెటీరియల్, అదేవిధంగా ఒక గ్యాంగ్ ఎన్నికల కోసం పంచాల్సిన డబ్బు మిస్ అవుతుందన్నారు. ఈ రెండు అంశాలతో సాగే కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు, మునీష్‌కాంత్‌కు సంబంధించిన షూటింగ్‌ను తిరుచ్చిలో నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో పాటలు ఉండవని అన్నారు. ఇందులో లాల్ పోలీస్‌స్టేషన్‌లో నిజాయితీగల రైటర్‌గా నటించారని, దర్శన్ పోలీస్ అధికారిగా నటించారని చెప్పారు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన కథా చిత్రం ఇదన్నారు. చిత్రం చూసిన ప్రేక్షకులు గుడ్ ఫీల్‌తో బయటకు వస్తారని దర్శకుడు పేర్కొన్నారు.