
విద్యా కేంద్రంగా తమిళనాడు
● మంత్రి అన్బిల్ మహేశ్
సాక్షి, చైన్నె: భారత దేశానికే తమిళనాడు అత్యున్నత విద్యా కేంద్రంగా అవతరించిందని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి తెలిపారు. క్రెసెంట్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ సంబరాలు గురువారం రాత్రి చైన్నెలో జరిగాయి. అన్నాసాలైలోని కామరాజ్ అరంగంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి ప్రసంగిస్తూ, ఐదు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యకు, నమ్మకానికి, సమర్థులైన యువతులను తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల పాత్రను ప్రశంసించారు. మిస్తైల్ మ్యాన్ శ్రీడాక్టర్ అబ్దుల్ కలాం నుంచి మాజీ రాష్ట్రపతి నారాయణన్ వరకు ఎందరో ద్విభాషా విధానం అమలైన పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థానానికి చేరారని వివరించారు. ఈ విధానమే ప్రతి విద్యార్థి భవిష్యత్ అని, ఆ దిశగా తమిళనాడు ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలంగా రూపొందించి ఉందన్నారు., అందరికీ అందుబాటులో ఉండే, సమానమైన, నాణ్యమైన విద్యను నిర్ధారించడానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు వ్యవస్థలను తమిళనాడు కలిగి ఉందన్నారు. నేడు తమిళనాడు దేశంలోనే అత్యున్నత విద్యాకేంద్రంగా మారిందన్నారు. నాగపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలూర్ షానవాస్ పాల్గొని బలమైన విలువలతో కూడిన అకడమిక్ ఎక్సలెన్స్‌ను నిర్ధారించడంలో సీత కతి ట్రస్ట్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీత కతి ట్రస్ట్ చైర్మన్ ఆరీఫ్ బుహారీ రెహమాన్, కార్యదర్శి ఖలీద్ బుహారీ, ది రైస్ గ్లోబల్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ జగత్ గాస్పర్‌రాజ్, ఐయూఎంఎల్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఫాతిమా ముజఫర్, పాఠశాల కరస్పాండెంట్ షరీఫా ఎ.అజీజ్, ప్రిన్సిపల్ బుష్రా అమౌల్లా, జాయింట్ కరస్పాండెంట్ మరియం హబీబ్, వైస్ ప్రిన్సిపల్ , కోఆర్డినేటర్ జమీరా ఆఫ్రాన్ పాల్గొన్నారు.