
14న మద్దతుదారులతో పన్నీరు భేటీ
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈనెల 14న తన మద్దతుదారులతో సమావేశానికి మాజీ సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. వేప్పేరిలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు పన్నీరుసెల్వం విస్తృతంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాజకీయంగా రాష్ట్రంలో బలపడ్డారు. తన బలాన్ని మరింతగా చాటుకునే దిశగా రాష్ట్రంలో చైతన్య యాత్ర పేరిట పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తర్వాత కార్యాచరణపై పన్నీరుసెల్వం దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఈనెల 14న మద్దతుదారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ సైతం తనను పక్కన పెట్టిన నేపథ్యంలో పన్నీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఎదురుచూపులు పెరిగాయి. అదే సమయంలో అన్నాడీఎంకే వివాదంపై కేంద్ర ఎన్నికల కమిషన్ జాప్యం చేస్తుండడం హైకోర్టుకు శుక్రవారం చేరింది. అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ తీరును ఖండించారు. జాప్యమేలా అంటూ ప్రశ్నలు వేశారు.