
అభివృద్ధి పనులు వేగవంతం
తిరువళ్లూరు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని అంచనాల కమిటీ అధ్యక్షుడు గాంధీరాజన్ ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లాలోని 2024–26 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన వేర్వేరు అభివృద్ధి పనులను గాంధీరాజన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కరుమాణిక్యం, చిన్నదురై, వెంకటేషన్, రాజా, ఎస్.ఎస్ బాలాజి, సుదర్శనం, పన్నీర్‌సెల్వం, కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, వాటి నాణ్యతను సైతం పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో సహకార, దేవదాయ, మున్సిపల్, వ్యవసాయం, రోడ్డు భవనాలు, విద్యాశాఖ సహా 20 శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీరాజన్ మాట్లాడుతూ తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహాకుంభాబిషేకం జరిగినా అక్కడ అర్ధాంతరంగా ఆగిన అభివృద్ధి పనుల కోసం రూ.16.50 కోట్లను కేటాయించి పనులు చేస్తున్నట్టు వివరించారు. 500 మంది భక్తులు కూర్చునేలా కల్యాణమండపం, రూ.14 కోట్లతో నాలుగు మండపాలను నిర్మిస్తున్నామని, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం నూతన అన్నదాన సత్రం నిర్మాణాన్ని రూ.26 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. తిరువళ్లూరులో రూ.37 కోట్లతో నిర్మిస్తున్న బస్టాండు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాన్, అదనపు కార్యదర్శి సుబ్రమణ్యం పాల్గొన్నారు.