
క్లుప్తంగా
కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి
వేలూరు: కనీస వసతులు కల్పించాలని శక్తినగర్ వాసులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ము ట్టడించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని సేన్‌బాక్కం శక్తినగర్‌లో 15 ఏళ్లుగా సుమారు 500 కుటుంబాలకుపైగా నివశిస్తున్నాయి. తమ ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ స్థానికులు మేయర్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఆ సమయంలో మేయర్ ఇది వరకే శక్తినగర్‌కు నిధులు కేటాయించి, పనులు చేయక పోవడంతోనే రోడ్డు వసతి, డ్రైనేజీ కాలువ, తదితర వసతులు చేయలేక పోయామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధు లు కేటాయించి పనులు చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన శక్తినగర్ వాసులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి, ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని, డ్రైనేజీ కాలువ లేక పోవడంతో నీరు పూర్తిగా వీధులపై రావడంతో దోమల బెడదతోపాటు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరో పించారు. తమ ప్రాంతంలో పన్నులు మాత్రం వసూలు చేసుకుని కనీస వసతులు కల్పించడం లేదని, దీనిపై కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు.
వేలూరులో అన్నాడీఎంకే ధర్నా
వేలూరు: పెట్‌ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి మూసివేత నిరసనగా అన్నాడీఎంకే కార్యకర్తలు ధర్నా చేశా రు. వేలూరులో పెట్‌ల్యాండ్ ప్రభుత్వాస్పత్రిని రూ.198 కోట్ల వ్యయంతో నిర్మించి, గత నెల 25వ తేదీన సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి కనీస వసతులు లేకపోవడంతో ఆస్పత్రిని మూసి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి మూసివేతకు నిరసనగా అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వేలూరు అన్నారోడ్డులో ధర్నా నిర్వహించనున్న ట్లు ప్రకటించారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీ మాజీ మంత్రి ముక్కూరు సుబ్రమణియన్, జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు, ఐటీ విభాగం రీజినల్ కార్యదర్శి జననీ సతీష్‌కుమార్, జిల్లా కోశాధికారి మూర్తి, జిల్లా మాజీ కార్యదర్శి రాముల అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో అన్నారోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని, ధర్నా నిర్వహించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కార్యకర్తలు ధర్నా చేయడంతో పోలీసులు చేసేది లేక కార్యకర్తలను అరెస్టు చేసి ప్రైవేటు కళ్యాణ మండపంలో ఉంచారు.
థింఫామ్ పర్వత రహదారిలో చిరుత సంచారం
సేలం : థింఫామ్ పర్వత రహదారిలో చిరుతపులి సంచరిస్తుండగా ఓ వాహనచోదకుడి చూసి, భయాందోళనకు గురయ్యాడు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని తింబం కొండల్లోని రోడ్డు మీదుగా కర్ణాటక నుంచి సత్యమంగళం ప్రాంతానికి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తింబం కొండల్లో ఏనుగులు, చిరుతలు ఉన్నాయి. సోమవారం రాత్రి తింబం కొండ రోడ్డులోని 3వ హెయిర్‌పిన్ మలుపు వద్ద ఒక వ్యక్తి వాహనంలో వెళుతుండగా అక్కడ ఉన్న రిటైనింగ్ వాల్‌పై చిరుతపులి పడుకుని ఉండడం చూసి అతను షాక్ అయ్యాడు. వాహనం కాంతిని చూసి, రిటైనింగ్ వాల్‌పై ఉన్న చిరుతపులి అకస్మాత్తుగా మేల్కొంది. దీనితో భయపడిన డ్రైవర్ నెమ్మదిగా తన వాహనాన్ని వెనక్కి తిప్పాడు. అక్కడి నుంచి లేచిన చిరుతపులి కొంతసేపు రోడ్డు వెంట నడిచి, ఆపై అడవిలోకి వెళ్లింది.
రోడ్డు ప్రమాదంలో నలుగురు చైన్నె వాసుల మృతి
అన్నానగర్: కారును లగేజీ వ్యాను ఢీకొన్న సంఘటనలో చైన్నెకి చెందిన నలుగురు మృతి చెందారు. చైన్నెలోని పెరుంగళత్తూర్‌కు చెందిన కుమార్ (57). అతని భార్య జయ (55), కుమార్తె మోనిషా (30), బంధువులు స్టాలిన్ (36), అతని భార్య దుర్గ (32), వారి కుమార్తె నీలవేణి సూర్య(3) కారులో తంజావూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు. వారు మంగళవారం ఉదయం కుంభకోణంలోని ఆలయాన్ని సందర్శించిన తర్వాత తంజావూరులోని పెద్ద ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు. తంజావూరు సమీపంలోని విక్రవాండి బైపాస్‌లో కారు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లగేజ్ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో జయ అక్కడికక్కడే మరణించింది. కుమార్, దుర్గ, మోనిషా, స్టాలిన్, నీలవేణి సూర్య, మినీ లారీ డ్రైవర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న తంజావూరు తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. కుమార్, దుర్గ, బాలిక నీలవేణి సూర్య ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మోనిషా, స్టాలిన్, లారీ డ్రైవర్ విఘ్నేష్ చికిత్స పొందుతున్నారు.

క్లుప్తంగా