
అన్భుమణిపై చర్యకు నిర్ణయం
– రామన్న భేటీలో తీర్మానం
సాక్షి, చైన్నె : పీఎంకే నుంచి అన్బుమణి తొలగించేందుకు రాందాసు సిద్ధమయ్యారు. ఆయనపై చర్యకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంగళవారం తీర్మానం చేశారు. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న సమరం క్‌లైమాక్స్ దశకు వచ్చినట్టుంది. అన్బుమణి చర్యలను తీవ్రంగా పరిగణించిన రాందాసు ఆయన్ని పార్టీ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా మంగళవారం తైలాపురంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు నేతృత్వంలో జరిగిన సమావేశంలో అన్బుమణి చర్యలపై తీవ్రంగా చర్చించారు. అన్బుమణి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్నట్టు పలువురు నేతలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను దారిలోకి తెచ్చుకోవాలంటే, వేటు పడాల్సిందేనని నినదించినట్టు సమాచారం. చివరగా సమావేశంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని రాందాసుకు అప్పగించారు. అలాగే అన్బుమణిపై చర్యలు తీసుకునేలా తీర్మానించడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తే అన్బుమణిని పీఎంకే నుంచి తప్పిస్తారా..? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. తైలాపురంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న వేళ చైన్నె టీనగర్‌లో అన్బుమణి తన మద్దతు దారులతో చర్చలలో మునగడం గమనార్హం.