
విజయ్ చేసిన ఒక్క ఫోన్ కాల్‌తో..
తమిళసినిమా: బిగ్‌బాస్ సీజన్ 5లో టైటిల్ విజేతగా నిలిచిన రాజు రాజమోహన్ కథానాయకుడిగా పరిచయం అయిన చిత్రం బన్ బట్టర్ జామ్. రెయిన్ ఆఫ్ ఆరోస్ పతాకంపై సురేష్ సుబ్రమణియమ్ నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్ధాధ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఆద్య ప్రసాద్, భవ్య ట్రిక్కా హీరోయిన్లుగా నటించిన ఇందులో చార్లీ, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని, మైఖెల్, వీజే పప్పు, ధర్మదురై తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బాబు ఛాయాగ్రహణం, నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు రాజు రాజమోహన్ మాట్లాడుతూ బిగ్ బాస్ వల్లే తనకు కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చిందన్నారు. తనను అందరూ హీరో అంటున్నారని, సినిమాల్లో హీరో అమ్మను కాపాడటం, ఆపదలో ఉన్న స్నేహితులను కాపాడటం చేస్తామన్నారు.కాగా తనను హీరోగా చేసిన నిర్మాతను కాపాడినప్పుడే తాను హీరో అని చెప్పుకుంటానని పేర్కొన్నారు. ఇది ఆబాలగోపాబాలం చూసి ఆనందించే ప్రేమ వినోదం, యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ చిత్రం వేస్ట్ చేయదన్నారు. కాగా ఒక్క ఫోన్ కాల్ తో ఈ చిత్రం చాలా మందికి తెలిసిందన్నారు. ఆయనకు తనపై ఎలాంటి అభిప్రాయం ఉందీ, తాను ఆయనకు ఇష్టమా? ఎందుకు తనకు శుభాకాంక్షలు అందించారు అన్నవి తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని పేర్కొన్నారు.