
తిరుమళిసై సిడ్కోలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తిరువళ్లూరు: తిరుమళిసై సిడ్కో ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, వర్షపు నీరు వెళ్లడానికి కాలువల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో సిడ్కో ప్రాంతంలో సుమారు 300కు పైగా పరిశ్రమలున్నాయి. వీటితోపాటు భారీ పరిశ్రమలు పదికి పైగా ఉన్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు నేమం చెరువు నుంచి మొతాదుకు మించి నీటిని విడుదల చేయడంతో పరిశ్రమలు మునిగిపోయి భారీ నష్టం కలిగింది. దీంతో అప్పటి నుంచి తిరుమళిసై సిడ్కోలో వర్షపు నీరు కాలువలు, పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్ నీటిని శుద్ధీకరణ కేంద్రానికి తరలించడానికి ప్రత్యేక కాలువలను నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమళిసై సిడ్కో ప్రాంతంలో తనిఖీ చేశారు. కాలువల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. సిడ్కోలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇతర సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని కలెె క్టర్ తెలిపారు.