20 లక్షల మందికి ల్యాప్‌ టాప్‌లు | - | Sakshi
Sakshi News home page

20 లక్షల మందికి ల్యాప్‌ టాప్‌లు

May 24 2025 1:35 AM | Updated on May 24 2025 1:35 AM

20 లక్షల మందికి ల్యాప్‌ టాప్‌లు

20 లక్షల మందికి ల్యాప్‌ టాప్‌లు

● అంతర్జాతీయ స్థాయి సంస్థలకు పిలుపు ● టెండర్ల ఉత్తర్వుల జారీ

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులు 20 లక్షల మందికి ల్యాప్‌టాప్‌ల పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సంస్థలకు ఈల్యాప్‌టాప్‌ కొనుగోలు నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత సీఎం జే జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వం గతంలో ప్లస్‌–1 ముగించి ప్లస్‌టూ వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ జరిగేది. అయితే ఆమె మరణంతో ఈ పథకం మూలన పడింది. డీఎంకే సైతం ఈ పథకం మీద దృష్టి పెట్ట లేదు. అయితే ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల్లో పాలకులు ల్యాప్‌టాప్‌ ప్రస్తావనను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సారి ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్‌ల పంపిణీ నిమిత్తం రెండురోజుల క్రితం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం సైతం నిర్వహించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి, ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులు, అన్నా విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్‌, కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేటిక్స్‌, తమిళనాడు ఇ–గవర్నెన్‌న్స్‌ ఏజెన్సీ, టెక్నాలజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ తమిళనాడు తదితర వాటిలోని నిపుణులతో సాంకేతిక ప్రమాణాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద అందించే ల్యాప్‌టాప్‌ల పనితీరు, మెమరీ (స్టోరేజ్‌), సాఫ్ట్‌వేర్‌, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్‌తో సహా సాంకేతిక పరికరాల సమగ్ర సమాచారాలను సిద్ధం చేశారు. మరిన్ని సమాచార సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌ సంబంధిత డిజిటల్‌ సేవల పరిశ్రమ నుంచి ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపారు.

టెండర్లు పిలుపు

2025–26 విద్యా సంవత్సరంలో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లను పంపిణీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ పథకంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ముందు జాగ్రత్తగా టెండర్లకు సైతం ఓ కమిటీని నియమించారు. కళాశాలల ద్వారా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. టెండర్లలో ల్యాప్‌టాప్‌ల గురించి సమగ్ర సమాచారాలను సైతం వివరించేలా ఆదేశించారు. ఈ మేరకు 8 జీబీ ర్యాం, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్‌డిస్క్‌, 15.6 ఇంచ్‌ స్క్రీన్‌, హెడ్‌ కెమెరా, నాలుగు నుంచి ఐదు గంటల పాటుగా పనిచేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీ, వారంటీ వంటి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విద్యార్థులకు సమస్య ఎదురైన పక్షంలో ఫిర్యాదులకు సంబంధించి, పరిష్కారానికి సంబంధించిన కాల్‌ సెంటర్ల వివరాలను కూడా టెండర్ల ప్రక్రియలో పొందు పరిచేలా ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ సంస్థలకు సైతం ఆహ్వానాలు పలికారు. జూన్‌ 26వ తేదీలోపు ఈ టెండర్లను సమర్పించాలని సూచించారు. ఆ తరువాత త్వరితగతిన టెండర్ల ఖరారుతో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నుంచి విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లను అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement