విజయ్ చిహ్నం కుస్తీ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ద్వారా సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న తమిళగ వెట్రి కళగంకు ప్రస్తుతం చిహ్నం ఎంపిక సమస్యగా మారి ఉంది. విజిల్ లేదా క్రికెట్‌బ్యాట్‌ను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతున్నాయి. తమిళగ వెట్రి కళగంతో ప్రజలలోకి చొచ్చుకెళ్లే దిశగా సినీ నటుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ కార్యవర్గాలు, ఇతర రూపురేఖల నిర్మాణాలను పూర్తిచేశారు. మరి కొద్దిరోజులలో పూర్తిస్థాయిలో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చిహ్నంగా ప్రజలలోకి దేనిని తీసుకెళ్లాలో అన్న డైలమాలో నేతలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ కంటూ ఇరు వైపులా ఏనుగు, మధ్యలో పుష్పం అంటూ ఓ చిహ్నం ఉంది. అయితే, ఏనుగులను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ కేటాయించే చిహ్నాలలో ఏదో ఒక దానిని తమ పార్టీ ఎన్నికల గర్తుగా ఎంపిక చేసుకుని ప్రజలలోకి వెళ్లే దిశగా కసరత్తుపై విజయ్ దృష్టి పెట్టారు. ఎన్నికల కమిషన్ వద్ద ప్రస్తుతం ఏ పార్టీకి చెందకుండా విజిల్, క్రికెట్ బ్యాట్, మైక్, డైమండ్, రింగ్ ఉన్నట్టు తేలింది. ఇందులో విజిల్‌ను ఎంపిక చేసుకునే దిశగా పరిశీలన జరుగుతోంది. విజయ్ నటించిన బిగిల్‌చిత్రం అశేష ప్రేక్షకాదరణ పొంది ఉండడం గమనార్హం. అలాగే, క్రికెట్ బ్యాట్‌ను విజయ్ అనేక చిత్రాలలో ఉపయోగించిన నేపథ్యంలో ఈరెండింటిలో ఒకదాన్ని పార్టీ ఎన్నికల చిహ్నంగాఎంపిక చేసుకుని ప్రజలలోకి వెళ్లేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అదే సమయంలో 2026 ఎన్నికలలో 1,10,000 వేల ఓట్ల ఆధిక్యంతో విజయ్ విజయ ఢంకా మోగించడమే కాకుండా సంపూర్ణ ఆధిక్యంతో అధికార పగ్గాలు చేపట్టినట్టుగా రాష్ట్రంలో అనేక చోట్ల అభిమానులు పోస్టర్లను హోరెత్తించడం గమనార్హం.


