
కేరళకు ఖనిజ సంపదల అక్రమరవాణా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి జిల్లాలోని క్వారీల ద్వారా ఖనిజ సంపదలను కేరళకు అక్రమ రవాణాలో అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఖనిజ సంపదల విభాగం అధికారులందరిపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇద్దర్ని సస్పెండ్ చేయగా, ఒకరిని వీఆర్‌కు పంపించారు. మిగిలిన వారందర్నీ మూకుమ్మడిగా ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలు.. తిరునల్వేలి జిల్లాలో క్వారీలు అధికం, ఇక్కడి కొండలను క్వారీలు పిండి చేస్తున్నాయి. నిర్ణీత శాతం కంటే అధికంగా తవ్వకాలు జరిపి ఖనిజ సంపదలను అక్రమంగా కేరళకు తరలించేస్తున్నారు. పొరుగున ఉన్న కేరళకు ఈ అక్రమ రవాణా సాగుతుండడం వెనుక అధికారుల హస్తం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. నకిలీ రశీదులతో అధికారులు సాగిస్తూ వచ్చిన మాయాజాలం ప్రభుత్వం దృష్టికి చేరింది. దీనిపై రహస్యంగా ఉన్నతాధికారలు విచారణ జరిపి అక్రమాలలో భాగస్వామ్యంగా ఉన్న అధికారుల భరతం పట్టే విదంగా ఉత్తర్వులు జారీ చేశారు. తిరునల్వేలి జిల్లా ఖనిజ సంపదల విభాగం డైరెక్టర్ బాల మురుగన్‌ను వీఆర్‌కు పంపించారు. అసిస్టెంట్ ఇంజినీరుతో పాటూ మరో మహిళా అధికారినిని సస్పెండ్ చేశారు. జిల్లాలోఉన్న 100 మందికి పైగా అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరందర్నీ ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. తిరునల్వేలి జిల్లా ఖనిజ సంపదల విభాగానికి పూర్తిగా కొత్త ముఖాలను తీసుకొచ్చిపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం గమనార్హం.
నెల్‌లై జిల్లాలోని అధికారులందరిపై కన్నెర
ఇద్దరు సస్పెన్షన్, ఒకరు వీఆర్‌కు..

కేరళకు ఖనిజ సంపదల అక్రమరవాణా