
టార్గెట్.. విశాఖన్
● ఈడీ తీవ్ర విచారణ ● రెండో రోజుగా సోదాలు
సాక్షి, చైన్నె: టాస్మాక్ ఎండీ ఐఎఎస్ అధికారి విశాఖన్‌ను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసినట్టుంది. ఆయన వద్ద తీవ్ర విచారణలో ప్రత్యేక బృందం అధికారులు నిమగ్నమయ్యారు. రెండో రోజుగా శనివారం ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. రాష్ట్రంలోని మద్యం షాపులకు అను సంధానంగా బార్‌ల ఏర్పాటు, మద్యం కొనుగోళ్లు తదితర వ్యవహారాలకు సంబంధించిన టెండర్లన్ని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) నేతృత్వంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా ఇటీవల చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో ఈడీ గుర్తించింది. హైకోర్టు ఆదేశాలతో తదుపరి విచారణను తాజాగా వేగవంతం చేసింది. శుక్రవారం ఎనిమిది చోట్ల చైన్నెలో విస్తృతంగా ఈడీ సోదాలు జరిగాయి. ఇందులో టాస్మాక్ ఎండీ ఐఎఎస్‌అధికారి ఆర్ విశాఖన్‌ను ఈడీ టార్గెట్ చేసింది.
ముమ్మర విచారణ
విశాఖన్ ఇంట్లో లభించిన ఆధారాలు, వాట్సాప్ కాల్ సందేశాల ఆధారంగా ఈ స్కాంలో ఓ కీలక వ్యక్తి ఉన్నట్టు, ఆయన ఎవరో అన్నది వెలుగులోకి తెచ్చే దిశగా ఈడీ విచారణ వేగవంతమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. విశాఖన్‌ను నుంగంబాక్కంలోని కార్యాలయానికి తీసుకెళ్లి శుక్రవారం పొద్దు పోయే వరకు ఈడీ వర్గాలు తీవ్రంగా విచారించాయి. రెండవ రోజైన శనివారం కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఈడీ విచారణ జరగడం గమనార్హం. ఆయన ఇంట్లో లభించిన ఆధారాలు, వాట్సాప్ సందేశాలు, మెస్సేజ్‌లను గురి పెట్టి అనేక ప్రశ్నలను ఈడీ సందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ టెండర్ల ప్రక్రియ, అక్రమాల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అన్న విచారణ విస్తృతంగా సాగుతుండటంతో తదుపరి ఈడీ ఎవరిని టార్గెట్ చేయనున్నదో అన్న ఉత్కంఠ మార్కెటింగ్ కార్పొరేషన్‌లోనే కాదు, ఎకై ్సజ్ శాఖలోనూ నెలకొంది. అదే సమయంలో రాష్ట్ర మంత్రి ముత్తుస్వామి మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు ధోరణితో ఈడీ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపును చట్ట పరంగా తిప్పి కొడుతామని, న్యాయ పోరాటం చేయనున్నామని వ్యాఖ్యానించారు.