
నేటి నుంచి సిందూర్ యాత్ర!
నైనార్
సాక్షి, చైన్నె : పాక్ ఉగ్ర మూకలను ఏరి పారేసే రీతిలో సాగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆర్మీ ప్రదర్శించిన అత్యుత్తమ సాహసాన్ని విజయోత్సవంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. నాలుగు విడతలుగా రాష్ట్రలో సిందూర్ యాత్ర పేరిట జాతీయ జెండాను చేత పట్టి యాత్ర చేపట్టనున్నామని మంగళవారం స్థానికంగా ప్రకటించారు. బుధవారం చైన్నెలో జాతీయ జెండా రెప రెపలాడేలా, భారత ఆర్మీ సేనల శౌర్యాన్ని చాటేలా యాత్ర జరుగుతుందన్నారు. 15వ తేదీన ఇతర నగరాల్లో, 16,17 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, 18 నుంచి 23వ తేదీ వరకు గ్రామ గ్రామన జాతీయ జెండా రెప రెపలాడేలా త్రివర్ణ దళాలకు మద్దతుగా నిలిచే రీతిలో సిందూర్ యాత్ర సాగనున్నట్టు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.
పల్లావరం– కుండ్రత్తూరు రోడ్డు విస్తరణకు భూ సేకరణ
కొరుక్కుపేట: పల్లావరం – కుండ్రత్తూరు రోడ్డు విస్తరణకు భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. చాలా ఏళ్లుగా ఈ రహదారి వెడల్పు చేయలేదు. ఇది పల్లావరం , పమ్మల్ , అనకాపుత్తూరు , తిరునీర్మలై , కుండ్రత్తూరు , పోరూర్ , పూందమల్లిని కలిసే ప్రధాన రహదారి. ఇది రెండు లైన్ల రోడ్డుగా ఉంది. ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటున్నారు. అనకాపుత్తూరు నుంచి పల్లావరం వరకు 4 కిలో మీటర్లు ప్రయాణం దాదాపు 35 నుంచి 40 నిమిషాలు పడుతోంది. అందువల్ల ఈ రహదారిని వీలైనంత త్వరగా నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లావరం –కుండ్రత్తూరు రహదారిని రెండు నుంచి 4 లైన్లుగా విస్తరించే ప్రాజెక్టు కోసం భూమి సేకరించే పనులు ప్రారంభమైయ్యాయి . భూసేకరణ ముగిసిన తరువాత పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు .
ఐదేళ్ల లా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కొరుక్కుపేట: ప్రభుత్వ న్యాయ కళాశాలల్లో 5 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు సోమవారం ప్రారంభమైంది. 5 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బి– ఆనర్స్), బీకాం ఎల్‌ఎల్‌బి(ఆనర్స్), బీజీఏ ఎల్‌ఎల్‌బీ చైన్నెలోని తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో కోర్సులు అందిస్తున్నారు. చైన్నె, మదురై, తిరునల్వేలి తదితర ప్రదేశాలలోని ప్రభుత్వ లా కాలేజీల్లో ఈ కోర్సులు అందించబడుతున్నాయి . పార్టు టైమ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులు కూడా అందించబడుతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం(2025–26)లో ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 12వ తేదీన ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తుందని లా యూనివర్సిటీ ప్రకటించింది. దీని ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు సోమవారం నుంచి ప్రారంభమైంది. ఐదేళ్ల లా కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు www.tndau.ac.in వెబ్ సైట్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు . వివిధ న్యాయ కోర్సులకు విద్యా అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు రుసుములు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని తెలిపారు . అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాల కోసం విద్యార్థులు లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గౌరీ రమేష్ 044–24641919, 24957414 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చునని ప్రకటించారు.
అన్నదానానికి కర్ణాటక భక్తుడి విరాళం
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అన్నదాన సేవకు కర్ణాటక భక్తుడు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త ప్రసాద్‌బాబు తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామిని దర్శనం చేసుకునేందుకు మంగళవారం ఉదయం వచ్చారు. ఆయనకు ఆలయ పేష్కార్ దామోదరన్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మూలవర్లు, వల్లి, దేవసేన, ఉత్సవర్లు, షణ్ముఖర్, ఆపత్సహాయక వినాయకుడు, కల్యాణ ఉత్సవర్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో నిత్య అన్నదాన సేవ కోసం రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అన్నదాన సేవా కేంద్రానికి వెళ్లి భక్తులకు ఉదయం అల్పాహారం అందజేశారు. అతను వెంట నొచ్చిలి గ్రామానికి చెందిన చక్రవర్తి నాయుడు, ముద్దుకృష్ణమ నాయుడు పాల్గొన్నారు.