తమిళసినిమా: పాత్రల కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన ఇంతకుముందు నటించిన జైభీమ్, సూరరై పోట్రు, కంగువ వంటి చిత్రాలే ఉదాహరణ. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెట్రో ఒకటి. ఇది ఆయన నటిస్తున్న 44వ చిత్రం కావడం గమనార్హం. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఇందులో జయరామ్, కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సూర్య ఇటీవల థాయ్‌ల్యాండ్ వెళ్లొచ్చారట. ఎందుకో తెలుసా? అక్కడ ఆత్మరక్షణ విలువిద్యలు నేర్చుకోవడానికి. అవును రెట్రో చిత్రంలోని ఫైట్ సన్నివేశాలు మామూలుగా కాకుండా, సహజత్వంగానూ, వైవిధ్యంగానూ ఉండాలని యూనిట్ వర్గాలు భావించారట. ఇందు కోసం థాయ్‌ల్యాండ్‌కు చెందిన స్టంట్‌మాస్టర్ కేచా ఖమ్‌పక్డీని ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా ఎంపిక చేశారు. ఈయన ఇంతకు ముందు బాహుబలి 2, జవాన్, విశ్వరూపం చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. రెట్రో చిత్రంలో ఫైట్ సన్నివేశాల కోసం సూర్య ఇటీవల థాయ్‌ల్యాండ్ వెళ్లి కేచా ఖుమ్‌పక్డీ వద్ద కొన్ని ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందారని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ పుట్టిన రోజు సందర్బంగా రెట్రో చిత్రంలోని వర్కింగ్ సన్నివేశాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు. ఇది ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది.