తమిళసినిమా: నటి వైజయంతిమాల. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది నటి అని కాదు. భరతనాట్య మయూరి అనే. ఈ అద్భుత నాట్యకళాకారిణి 1949లో ఏవీఎం సంస్థ నిర్మించిన వాళ్కై చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఇరుంబుతిరై, పార్థిబన్ కనవు, తేన్ నిలవు, బాగ్దాద్ తిరుడన్ వంటి పలు ఆణిముత్యాలాంటి చిత్రాల్లో నటించారు. వంజికోట్టై వాలిభన్ చిత్రంలో కన్నుమ్ కన్నుమ్ కలందు అనే పాటలో పద్మినితో కలిసి చేసిన నాట్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. చైన్నెలో పుట్టి పెరిగిన వైజయంతి మాల నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఎంపీగా ప్రజలకు విశేష సేవలు అందించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైజయంతిమాల గత ఏడాది పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా 90 ఏళ్ల నాట్య కళాకారిణి గత ఏడాది అయోధ్యలో భరతనాట్యం నృత్య ప్రదర్శనను ఇచ్చి భక్త జనులకు మధురానుభూతిని కలిగించారు. కాగా ప్రస్తుతం ఈమె వయసు 91 ఏళ్లు. కాగా ఇటీవల వైజయంతిమాల తనువు చాలించినట్లు వదంతులు దొల్లాయి. అయితే అవన్నీ వదంతులే అని ఆమె అనుచరులు కొట్టిపారేశారు. వైజయంతిమాల సోమవారం తిరుచ్చిలోని శ్రీరంగనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీరంగనాథుని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీరంగనాథుడిని, అమ్మవారిని దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. తాను 13వ ఏట నుంచే భరతనాట్యంలో అరంగేట్రం చేశానని, కఠిన శ్రమతోనే పేరు, ప్రఖ్యాతలు పొందానని అన్నారు. అనుభూతులు, భక్తినే తనను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. యువత కఠినంగా శ్రమించాలని, శ్రమిస్తేనే ఉన్నత స్థాయికి ఎదగగలరని వైజయంతిమాల పేర్కొన్నారు.
ఆలయంలో వైజయంతిమాలతో కుటుంబసభ్యులు