తిరువళ్లూరు: విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు సమీపంలో గుట్కా, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే దుకాణం లైసెన్సులను రద్దు చేస్తామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలోని ఉలగనాథన్ నారాణయస్వామి ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తిరువళ్లూరును తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు 500మీ దూరంలో గుట్కా, గంజాయిని విక్రయిస్తే మొదటి సారి 30 రోజుల పాటు దుకాణాన్ని సీజ్ చేస్తామని, రెండవ సారి విక్రయిస్తే శాశ్వతంగా దుకాణాల లైసెన్సును రద్దు చేస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. గత నెల రోజుల్లో 1,300 ప్రాంతాల్లో పోలీసులు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు అవగాహనా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆవడి డిప్యూటీ కమిషనర్ పొన్‌శంకర్, ప్రిన్సిపల్ తిల్‌లైనాయగి, డిప్యూటీ కలెక్టర్ బాలమురుగన్, తహసీల్దార్ శివకుమార్ పాల్గొన్నారు.