● అన్నాడీఎంకేను దూరం పెట్టేలా చర్యలు ● పన్నీరుకు చిరునవ్వుతో పలకరింపు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత సెంగోట్టయన్ స్పీకర్ అప్పావును అసెంబ్లీ ఛాంబర్‌లో కలవడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు దూరంగా ఆయన చర్యలు ఉండటమే కాకుండా అసెంబ్లీ లాబీలో మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరునవ్వుతో పలకరించి ముందుకెళ్లారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత సెంగోట్టయన్ ఇటీవల పెదవి విప్పడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత సమరంమళ్లీముదిరినట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, తాను అన్నాడీఎంకేలోనే ఉన్నట్టు సెంగోట్టయన్ చెప్పుకుంటూ వచ్చినా పళణి స్వామిని నేరుగా కలిసిన సందర్భం లేదు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన చర్చలు మరింత చర్చకు తెరలేపాయి. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన అన్నాడీఎంకే సభ్యులందరికి దూరంగా ఉన్నారు. రెండవ రోజు శనివారం సభకు రాగానే స్పీకర్ అప్పావు ఛాంబర్‌కు వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. ఈ సమయంలో తనకు లాబీలో ఎదురు పడ్డ మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరు నవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు. సాధారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సభ్యులు సభకు 4వ నెంబర్ ప్రవేశ మార్గం నుంచి లోపలకు రావడం జరుగుతుంది. అయితే, సెంగ్టోటయన్ ఆ పార్టీ సభ్యులకు దూరంగా ఉండటమేకాకుండా, వారు వెళ్లిన మార్గంలో కూడా లోనికి వెళ్ల లేదు. పదవ నెంబరు గేట్ మార్గం గుండా అసెంబ్లీలోకి వెళ్లారు. అన్నాడీఎంకే సభ్యుల ఛాంబర్ వైపుగా కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లి పోయారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకేలో మరింత చర్చకు తెరలేపాయి. సెంగోట్టయన్ చర్యల గురించి పళణి స్వామిని మీడియా ప్రశ్నించగా, ఆయన్ని అడగాల్సిన ప్రశ్న తనను అడిగితే ఎలా? అని ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగ వద్దు అని వారించారు. వ్యక్తిగత సమస్య గురించి మాట్లాడే వేదిక ఇక్కడ కాదని సూచించారు. తాము 62 మంది సభ్యులం అని, అందరూ ఇక్కడ ఉన్నారా? అంటే, కొందరు రాలేక పోయి ఉండ వచ్చు..!, వారికి ఏదైనా పని ఉండవచ్చు...! అంటూ దాట వేయడం గమనార్హం.