బావిలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

బావిలోకి దూసుకెళ్లిన కారు

Mar 15 2025 12:43 AM | Updated on Mar 15 2025 12:42 AM

● ఇద్దరి మృతి ● కారులో ప్రయాణించిన రైతు, రక్షించడానికి వెళ్లిన ఈతగాడు

సేలం: ఈరోడ్‌–సత్యమంగళం సమీపంలో కారు బావిలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలోని ముల్లికాపాళయంకు చెందిన రైతు యువరాజ్‌ (65)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం 6 గంటలకు తోటలో ఉన్న కారును యువరాజ్‌ నడుపుతున్నాడు. కారు అకస్మాత్తుగా అదుపుతప్పి వెనక్కి దూసుకెళ్లి సమీపంలోని 80 అడుగుల లోతైన బావి రిటైనింగ్‌ వాల్‌ను ఢీకొని బావిలో పడిపోయింది. బావిలో నీరు 50 అడుగుల లోతులో ఉండడంతో కారు నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న యువరాజ్‌ బయటకు రాలేక నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి గ్రామస్తులు సత్యమంగళం పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. యువరాజ్‌ను రక్షించే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది తాడుకట్టి బావిలోకి దిగారు. 50 అడుగుల లోతు వరకు నీరు నిలిచి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వారు రాత్రి 11 గంటల వరకు సహాయక చర్యలను కొనసాగించారు.

గజ ఈతగాడు మృతి

ఆ తరువాత, వారు భవానీసాగర్‌ నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించారు. వారిలో భవానీసాగర్‌ అన్నానగర్‌కు చెందిన తిరుమూర్తి(42) కూడా బావిలోకి దిగి యువరాజ్‌ను రక్షించడానికి ప్రయ త్నించాడు. బావిలోని నీటిని మోటారుతో బయటకు పంపింగ్‌ చేశారు. ఈ పరిస్థితిలో బావిలోకి దిగిన నలుగురు ఈతగాళ్లు ఊపిరాడక వెలుపలికి వచ్చేశారు. అయితే తిరుమూర్తి నీటిలో మునిగిపోయాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 9 గంటలపాటు శ్రమించిన తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, నీళ్లన్నీ ఖాళీ అయిన తర్వాత, కారులో ఉన్న యువరాజ్‌, తిరుమూర్తి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. తర్వాత బావిలో ఉన్న కారును కూడా ఒక పెద్ద క్రేన్‌ ద్వారా బయటకు తీశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈతగాడు తిరుమూర్తి కారు బావిలో పడడంతో దానిలోని గ్యాస్‌ బావిలోకి పోవడంతో ఊపిరాడక మరణించాడని తేలింది. ఈ ఘటనపై సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement