
మళ్లీ..వస్తున్నానని చెప్పండి!
తమిళసినిమా: అందం, అభినయమే కాదు, ధైర్యం కూడా మెండుగా కలిగిన నటి సమంత. జీవితంలో ఈమె గడించిన పేరు తో పాటు ఎదుర్కొన్న సవాళ్లు ఎక్కువే. సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారో, వ్యక్తిగతంగా చాలా సమస్యలను ఎదురొడ్డారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా పోరాటమే చేశారని చెప్పకతప్పదు. అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న తరుణంలో మైయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురవ్వడం సమంతనే కాదు, ఆమె అభిమానులు షాక్‌కు గురైయ్యారు. అయితే సమంతను వైద్య చికిత్స విషయం పక్కన పెడితే ఆమె మనోధైర్యమే ఆ వ్యాధి నుంచి బయట పడేలా చేసింది. కాగా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ ఖుషీ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. అయితే అంతకు ముందు నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. కాగా తనను తాను నిరూపించుకోవడానికి స్వంతంగా చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించిన సమంత మా ఇంటి మహాలక్ష్మీ పేరుతో చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలియదు గానీ, తాజా మరో వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధం అయ్యారు. తుంబద్ చిత్ర దర్శకుడు తదుపరి రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. అందులో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంతే కాదు మళ్లీ వస్తున్నానని చెప్పండి అని పేర్కొన్నారు. కాగా ఈమె ఇంతకు ముందే ఫ్యామిలీమెన్ –2 అనే వెబ్ సిరీస్‌లో నటించడం గమనార్హం.
నటి సమంత