
అవార్డులను అందజేస్తున్న చాన్స్‌లర్ వెంకటాచలం
కొరుక్కుపేట: విద్యలో అత్యత్తుమ ప్రతిభను కనబరిచిన 35 మంది విద్యార్థులను బంగారు పతకాలతో ఘనంగా సత్కరించారు. చైన్నెలోని పోరూర్‌లోని శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపక దినోత్సవం, యూనివర్సిటీ డేను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. చాన్స్‌లర్ వీఆర్ వెంకటాచలం అధ్యక్షత వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులకు, అధ్యాపకులకు, ఉద్యోగులకు బంగారు పతకాలు, అవార్డులతోపాటు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఎంబీబీఎస్‌లో మెరిట్ సాధించిన వి.సంజన ఐదు బంగారు పతకాలు సహా 35మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఇదిలాఉండగా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీతో శ్రీహెర్ కలిసి వైద్యసేవలను అందించడానికి ఫార్మసీతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు, శ్రీహెర్ విద్యార్థులకు జపనీస్ భాషా కోర్సులను అందించడం కోసం వర్సిటీలో ఏబీకే – దోసకాయ్ తమిళనాడు సెంటర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వైస్ చాన్స్‌లర్ డాక్టర్ మహేష్, డీన్ డాక్టర్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.