స్టెరిలైట్‌కు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

స్టెరిలైట్‌కు చెక్‌

Jun 3 2023 1:38 AM | Updated on Jun 3 2023 1:38 AM

స్టెరిలైట్‌ పరిశ్రమ - Sakshi

స్టెరిలైట్‌ పరిశ్రమ

వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు

ప్రత్యేక కమిటీ నియామకం

సాక్షి, చైన్నె: తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ పరిశ్రమలో నిల్వ ఉన్న జిప్సమ్‌ వ్యర్థాలను తామే తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్‌ శుక్రవారం ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించారు. అయితే ఈ తొలగింపునకు అయ్యే ఖర్చు అంతా పరిశ్రమ యాజమాన్యం వేదాంత గ్రూప్‌ భరించాల్సి ఉంటుందని ఆదేశించారు.

తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా దశాబ్దంకాలానికి పైగా ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. స్టెరిలైట్‌ కాపర్‌ ఉత్పత్తి పరిశ్రమ కారణంగా తూత్తకుడి పరిసరాలలోని ప్రజలు రోగాల బారీన పడుతుండడంతో ఉద్యమం 2017లో మరింతగా రాజుకుంది. 2018లో ప్రజా నిరసన మహోద్యమంగా మారింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులు నిర్వహించిన ర్యాలీ అల్లర్లకు దారి తీసింది. పోలీసులు కాల్పులు జరపడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. ఈ ఘటనతో స్టెరిలైట్‌ పరిశ్రమకు అన్నాడీఎంకే పాలకులు శాశ్వతంగా తాళం వేశారు. అలాగే ఈ ఘటనపై గత ప్రభుత్వం మాజీన్యాయమూర్తి అరుణా జగదీశన్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ రంగంలోకి దించింది. ఈ కమిటీ ఇటీవల ప్రస్తుత సీఎం స్టాలిన్‌కు నివేదికను అందజేసింది. ఈ నివేదిక అసెంబ్లీలో చర్చకు సైతం వచ్చింది. కమిషన్‌ సిఫారసు మేరకు కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో ఈ కాల్పులలో మరణించిన బాధితులకు అదనపు సాయం అందించాలని కమిషన్‌ సిఫారసుతో సీఎం స్టాలిన్‌ ఇటీవల స్పందించారు. బాధితులకు గతంలో రూ. 20 లక్షలు సాయం అందించగా, అదనంగా రూ.5 లక్షలు చొప్పున స్టాలిన్‌ అందజేశారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు స్టెరిలైట్‌కు పడ్డ తాళాన్ని ఎలాగైనా తొలగించుకునేందుకు వేదాంతా గ్రూప్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

న్యాయపోరాటం....

తమ సంస్థకుపడ్డ తాళాన్ని తొలగించడం లక్ష్యంగా ఐదేళ్లుగా వేదాంతా గ్రూప్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఆ పరిశ్రమలో కోట్ల విలువగల పరికరాలను తుప్పుబడుతున్నాయని, జిప్సమ్‌ వ్యర్థాలు పేరుకు పోయి ఉన్నాయని కోర్టుకు వివరించింది. ఈ వ్యర్థాల నిల్వ కారణంగా పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎలాగైనా పరిశ్రమకు పడ్డ తాళాన్ని తొలగించి, లోనికి వెళ్లడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న స్టెరిలైట్‌ యాజమాన్యానికి చెక్‌పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది.

రంగంలోకి కమిటీ..

వేదాంతా గ్రూప్‌ ఆ పరిశ్రమలోకి అడుగుపెట్టకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కోర్టు ద్వారా అనుమతి పొంది ఆ వ్యర్థాలను తొలగించడమే కాకుండా, ఇతర ప్రక్రియలపై ఆ యాజమాన్యం దృష్టి పెట్టవచ్చన్న సంకేతాలతో ఒక అడుగు ముందుకు వేశారు. శుక్రవారం కలెక్టర్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిప్సమ్‌ వ్యర్థాల తొలగింపు ప్రక్రియకు ప్రత్యేక కమిటీని నియమించారు. సబ్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, వేదాంతా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ప్రతినిధులు చొప్పున మొత్తం తొమ్మిది మందిని నియమించారు.ఆ పరిశ్రమ నుంచి ఇతర పరికరాలు, యంత్రాలు, విడి భాగాలు బయటకు తరలించకుండా పకడ్బందీ చర్యలతో కొన్ని నెలల వ్యవధిలో జిప్సమ్‌ వ్యర్థాలను తొలగించడం లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. అయితే, జిప్సమ్‌ వ్యర్థాల తొలగింపునకు అయ్యే అన్ని రకాల ఖర్చును వేదాంతా గ్రూప్‌ భరించాల్సి ఉంటుందని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పూవలగ నన్బర్గల్‌ సంఘం, స్టెరిలైట్‌ వ్యతిరేక ఉద్యమ కారులు ఆహ్వానించారు. కోర్టు ద్వారా ఒక వేళ తూత్తుకుడిలోకి స్టెరిలైట్‌ మళ్లీ ప్రవేశించే ప్రయత్నం చేస్తే, ఈ సారి మహాఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement