వసుదైక కుటుంబం మనది

గవర్నర్‌ రవిని సత్కరిస్తున్న తెలుగు ప్రముఖులు - Sakshi

సాక్షి చైన్నె: అనేక భాషలు, మతాలు కలిగిన మనమంతా భారతీయులమని, మనదంతా వసుదైక కుటుంబం అని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు చైన్నె రాజభవన్‌లోని దర్బార్‌ హాలు వేదికగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు కోలాహలంగా జరుపుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ, వామ్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌ తాడేపల్లి రాజశేఖర్‌ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్‌ఎన్‌ రవి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచదేశాల భారతదేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. మన సంస్కృతి, కళలను, ప్రజల్లో ఐక్యమత్యం చాటేలా ప్రధాని నరేంద్ర మోదీ వసుదైక కుటుంబం కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి కార్యక్రమాలు రాజ్‌భవన్‌లోనే కాకుండా విశ్వవిద్యాలయాలు, ఇతర సంఘాల్లో కూడా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. తెలుగు సోదర సోదరీమణులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కొత్త సచివాలయానికి రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి మహిళా ఆర్కిటెక్ట్‌ను సన్మానించారు. అలాగే తెలుగు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తొలిసారిగా ప్రభుత్వం తరఫున ఇతర రాష్ట్రాల వేడుకలను జరుపుకోవడం చాలా గర్వాంగా, సంతోషంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చూస్తుంటే జాతీయతాభావం తొణికిసలాడోతోందన్నారు. డాక్టర్‌ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు ప్రజలు 27 శాతం పైగా ఉన్నారని, తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. అలాగే బేతిరెడ్డి శ్రీనివాస్‌, ముత్తువేల్‌ మాట్లాడారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు:

తెలంగాణ గీతం జయ జయహో తెలంగాణ అనే పాటకు ప్రారంభ నృత్య ప్రదర్శనతో వేడుకలు ఆరంభమయ్యాయి. అలాగే భారతియార్‌ పాటను సైతం అలపించి సభలోని ప్రతిఒక్కరిలో దేశభక్తిని చాటారు. ఇంకా కళాకారిణి కలైమామని ఉమా మురళి బృందం ప్రకృతిని గురించి తెలియజేసే నృత్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఇంకా వసుదైక కుటుంబాన్ని తెలిపే పలు కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి. వేడుకలకు ముందుగా విచ్చేసిన ప్రతీ ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను గవర్నర్‌ రవి తెలియజేశారు. తెలుగు సంఘాలకు చెందిన కెఎన్‌ సురేష్‌ బాబు, గొల్లపల్లి ఇశ్రాయేలు, ఎంవి నారాయణ గుప్తా, జేఎం నాయుడు, పేర్ల బద్రీనారాయణ, సుజాత రమేష్‌ బాబు, తాడేపల్లి జయశ్రీ రాజశేఖర్‌, నేలటూరి విజయకుమార్‌, తిరుమలరావు, జి.ఏ. పృథ్వీ, సీ.హెచ్‌.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top