తిరువొత్తియూరు: హత్య కేసులో భర్త పేరును తొలగించాలని కోరుతూ విల్లుపురం జిల్లాలో డీఎంకే మహిళా కౌన్సిలర్ కుటుంబంతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా కిల్ పుత్తుపట్టు గ్రామానికి చెందిన దుర్గాదేవి డీఎంకే యూనియన్ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆమె గురువారం తన నలుగురు కుమారులు, బంధువులు 12 మందితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఆమె హఠాత్తుగా తాము తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. విచారణలో బొమ్మైయార్ ఆర్ పాలెంలో విమల్ రాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఆ కేసులో తన భర్త, డీఎంకే మత్స్యశాఖ విభాగం కార్యదర్శి తంగరాజును నిందితుడిగా చేర్చారని తెలిపారు. ఆ హత్యకు, తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి విన్నవించినట్టు తెలిపారు. తన భర్త పేరును కేసు నుంచి తొలగిస్తామని వారు చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు.


