
ఉన్నాల్ ఎన్నాల్ చిత్రంలో ఓ సన్నివేశం
తమిళసినిమా: ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. నటి సోనియా అగర్వాల్, ఢిల్లీ గణేశ్, రాజేశ్, ఆర్.సుందరపాండియన్, రవిమరియా, నెల్‌లైశివ వంటి నటీనటులతోపాటు జగా, ఏఆర్.జయకృష్ణ, ఉమేశ్, మోనిక, సహానా, నిహారిక, లుప్నా అమీర్ నూతన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీశ్రీ గణేశా క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రన్ సుబ్బయ్య నిర్మించారు. ఏఆర్.జయకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కిచ్చాస్ చాయాగ్రహణం, రిజ్వాన్ సంగీతాన్ని అందించారు. నిరుద్యోగం, ఆర్థిక సమస్యల కారణంగా వేర్వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు చైన్నెకి చేరుకుంటారు. అక్కడ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా వారికి పరిచయమైన యువతుల ప్రేమలో పడి కాలయాపన చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి కుటుంబసభ్యులు ఫోన్ చేసి వారి సమస్యలు చెప్పి బాధపడతారు. దీంతో ఆ యువకులు ఏం చేశారన్నదే ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం. ఇందులో సోనియాఅగర్వాల్ దౌర్జన్యంతో ఇతరుల ఆస్తులను ఆక్రమించే ప్రతి నాయకి పాత్రలో నటించారు. అలా నటుడు కోటీశ్వరుడైన రాజేశ్ వద్ద ఉద్యోగానికి చేరి ఆయన ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. అది జరిగిందా, లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. చాలా కష్టపడి, పలు సమస్యలను అధిగమించి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం జనరంజక అంశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్రయత్నం ఈ చిత్రంతో ఆగదని, మరిన్ని చిత్రాలు చేస్తామని నిర్మాతల వర్గం పేర్కొన్నారు.