ముంపు ముప్పు తప్పించాలని.. | - | Sakshi
Sakshi News home page

ముంపు ముప్పు తప్పించాలని..

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

ఆక్రమణలను కూడా తొలగిస్తాం..

కోదాడ పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో వరదలకు పట్టణంలో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అలా జరగకుండా ముందస్తుగా వాగులో పూడికను తొలగిస్తున్నాం. వాగు ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

–ఎర్నేని కుసుమ,

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోదాడ

కోదాడ పట్టణంలో వాగుల్లో

పూడికతీత పనులు ప్రారంభం

ఆక్రమణలను కూడా

తొలగించాలని ప్రజల డిమాండ్‌

గతంలో ముంపునకు గురైన

పలు కాలనీలు

కోదాడ రూరల్‌ : కోదాడ పట్టణంలో గతంలో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించినప్పుడు వాగులు ఆక్రమణకు గురికావడంతోపాటు పూడిక పేరుకుపోవడంతో కొన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కోదాడ మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం ముందస్తు చర్యలు చేపట్టింది. పట్టణంలోని పెద్దచెరువు అలుగువాగు, ఎర్రకుంట వాగుల్లో పూడికతీత పనులను ముమ్మరంగా ప్రారంభించారు. వాగుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. వాగులు ఆక్రమణలకు గురికావడం, పూడిక పేరుకుపోవడంతో గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు వారం రోజులపాటు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చేపట్టిన ఈ పనులు ఎంతవరకు ముంపును నివారిస్తాయనేది వేచి చూడాలి.

కుంచించుకుపోయిన వాగులు..

భారీ వర్షాలు పడినప్పుడు కోదాడ పెద్దచెరువు అలుగు పోస్తుంది. ఈ అలుగువాగు నీరు అనంతగిరి రోడ్డు నుంచి నయనగర్‌ను ఆనుకుని, తమ్మర బ్రిడ్జి మీదుగా షిర్డీ సాయినగర్‌ వెంట అల్వాలపురం వైపుగా ప్రవహించి పాలేరు వాగులో కలుస్తుంది. అయితే నయనగర్‌ నుంచి షిర్డీ సాయినగర్‌ వరకు ఈ వాగు ఆక్రమణలకు గురికావడంతో వెడల్పు బాగా తగ్గింది. దీనికితోడు వాగులో చెత్తాచెదారం వేయడంతో పూడిక పేరుకుపోయింది. ఇక తమ్మర బ్రిడ్జి వద్ద, షిర్డీ సాయినగర్‌ శివారు అల్వాలపురం వద్ద పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాగును ఆక్రమించారు. మరోవైపు ఉత్తమ్‌ పద్మావతి నగర్‌ నుంచి శ్రీమన్నారాయణ కాలనీ మీదుగా ఎర్రకుంట వాగు ప్రవహిస్తుంది. ఈ వాగును కూడా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడంతో దీని వెడల్పు కూడా కుంచించుకుపోయింది. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు నీరు కిందకు ప్రవహించే మార్గం సరిపోక కాలనీలు నీటి ముంపునకు గురవుతున్నాయి.

ప్రాణాలు తీసిన వరదలు

వరుసగా గత రెండేళ్లుగా వచ్చిన వరదలకు ఖమ్మం రోడ్డులోని షిర్డీ సాయినగర్‌ పూర్తిగా నీట మునగడంతో అధికారులు అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా శ్రీమన్నారాయణ కాలనీలోని హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ ఎదురుగా ఉన్న వీధులు, భవానీ నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. అంతేకాకుండా, రెండేళ్ల కిందట వచ్చిన వరద ఉధృతికి హుజూర్‌నగర్‌ సర్వీస్‌ రోడ్డు వెంట వాగులో పడి ఒకరు, భారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో వాగులో పడి మరొకరు మృతి చెందడం పట్టణ ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోంది.

ఆక్రమణలను తొలగిస్తేనే..

పెద్దచెరువు వాగు, ఎర్రకుంట వాగుల్లో కేవలం పూడిక తీస్తే సరిపోదని, ఆక్రమణలను కూడా పూర్తిగా తొలగిస్తేనే పట్టణానికి వరద ముంపు ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. వాగులను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏర్పాటు చేసిన ప్లాట్లను తక్షణమే గుర్తించి కూల్చివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్‌లో సైతం వాగులు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఎర్రకుంట వాగులో పూడిక తీస్తున్న జేసీబీ

గత ఏడాది షిర్డీసాయి నగర్‌లో నీటమునిగిన ఇళ్లు (ఫైల్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement